వైద్యనాథం

వైద్యనాథం
బీహార్ లోని జార్ ఖండ్ ప్రాంతంలో వైద్యనాథం (దేవఘర్) అనే గ్రామంలో ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. సతీదేవి ఇక్కడే ఆత్మాహుతి చేసుకుందనీ, అందువలన ఈ ప్రదేశాన్ని 'చితాభూమి'అని పిలుస్తూ వుంటారు. రావణాసురుడు తన తల్లి కోరిక నెరవేర్చడం కోసం శివుడి ఆత్మ లింగం తీసుకుని వెళుతుండగా నారదుడు అడ్డగించినదీ, వినాయకుడు గోపాలకుడిగా వచ్చి రావణుడు పట్టుకోమని చెప్పిన లింగాన్ని భూమిపై ఉంచినది ఈ ప్రదేశంలోనే అని చెబుతారు. కర్ణాటక - గోకర్ణ క్షేత్రం విషయంలోనూ ఇదే కథ ప్రచారంలో ఉన్నప్పటికీ జ్యోతిర్లింగం మాత్రం ఇదేనని అంటారు.

ఇలా వినాయకుడు భూమిపై నుంచిన శివలింగాన్ని ప్రతిరోజు అభిషేకించే బాధ్యతను విష్ణు మూర్తి ఓ పిల్లవాడికి అప్పగించాడు. అభిషేకం చేసినందుకు గాను ఆ పిల్లవాడి పేరుతోనే ఆ క్షేత్రం ప్రసిద్ధి చెందుతుందని చెప్పాడు. అలా ఆ పిల్లవాడి పేరుమీదే ఈ క్షేత్రానికి వైద్యనాధ్ అనే పేరు వచ్చింది. క్షీరసాగర మథనంలో వెలువడిన గరళాన్ని పరమశివుడు కంఠంలో దాచుకున్నది శ్రావణ మాసంలోనే! అందువలనే ఈ మాసంలోనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ... ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు కావిళ్లతో నీళ్లు తెచ్చి స్వామికి అభిషేకం చేసేవారట.

ఇప్పటికీ ఇదే సంప్రదాయం 'కావిడి ఉత్సవం' పేరుతో కొనసాగుతోంది. వైద్యనాథం సమీపంలోని సుల్తాన్ గంజ్ నుంచి భక్తులు కావిళ్లతో నీళ్లు తెచ్చి శివుడిని అభిషేకిస్తుంటారు. రోజువారి అభిషేకం ఆలయంలోని బావి నీటితోనే జరుగుతుంది. ఈ బావిని నిర్మించినది కూడా రావణాసురుడనే అంటారు. గరళాన్ని మింగడం వలన ఇక్కడి శివలింగానికి ఎంతగా అభిషేకం చేసినా చెమటలు పోస్తుంటాయి. అందువలన ప్రతి నిత్యం చందనం కూడా రాస్తూ వుంటారు.

ఆలయం పై కప్పులో నుంచి శివలింగంపై వెలుగులు వెదజల్లుతూ వుండే 'చంద్రకాంతమణి'ని చూసి తీరవలసిందేనని అంటారు. మహా శివరాత్రి రోజున స్వామికి ... త్రిపుర సుందరీ దేవికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ వుంటుంది. ఈ ఉత్సవ విశేషాలను తిలకించడానికి భక్తులు పెద్దసంఖ్యలో ఇక్కడి వస్తుంటారు.

More Bhakti Articles