త్రయంబకేశ్వర్

త్రయంబకేశ్వర్
త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర - నాశిక్ పట్టణానికి సమీపంలో, సహ్యాద్రి పర్వత శ్రేణిలోని 'బ్రహ్మగిరి'పై విరాజిల్లుతోంది. గౌతమీ నది పుట్టిన త్రయంబకంలో మహా శివుడు స్వయంభువుగా వెలిసిన కారణంగా ఈ స్వామిని త్రయంబకేశ్వరుడనీ ... అమ్మవారిని త్రయంబకేశ్వరి అని పిలుస్తూ వుంటారు.

ఇక్కడ ఈ జ్యోతిర్లింగ ఆవిర్భావం జరగడానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే ... పూర్వం సహ్యాద్రి పర్వత ప్రాంతంలో కరవుకాటకాలు ఏర్పడ్డాయి. జనులంతా నానా ఇబ్బందులు పడుతుండటంతో మహర్షులంతా ఆలోచనలో పడ్డారు. ఆ ప్రదేశానికి గంగను తీసుకురాగల సామర్థ్యం గౌతమ మహర్షికే వుందని భావించారు. తపోబలంతో ఆయన వేసిన పంటలో తాము సృష్టించిన మాయ గోవును ప్రవేశపెట్టారు. పంటను మేస్తోన్న ఆవును చూసి గౌతముడు తన చేతిలోని దర్భతో అదిలించడంతో అది అక్కడే మరణించింది. గోహత్యా పాపం పోవాలంటే ఆ గోవుపై నుంచి గంగను ప్రవహింప జేయమని మిగతా ఋషులు సూచించారు.

దాంతో గౌతముడు గంగకోసం తపమాచరించగా శివుడితో సహా గంగ ప్రత్యక్షమైంది. శివుడి అనుమతితో అతని జటాజూటము నుంచి ఆ గోవుపైకి దూకింది. దాంతో గోవు బతకడం ... ఆ పాపభారం నుంచి గౌతముడు బయటపడటం జరిగిపోయాయి. గంగ ... గోవు మీదుగా ప్రవహించడం వలన 'గోదావరి' అయింది. గౌతముడు తీసుకు రావడం వలన 'గౌతమి'గా పిలవబడుతోంది. గంగాదేవి అభ్యర్థన మేరకు శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు.

బ్రహ్మగిరి పై గంగ ఆవిర్భవించిన ఈ రోజున ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వుంటారు. ఇక్కడ అవతరించిన జ్యోతిర్లింగంలో లింగం పైభాగం కనిపించదు .. ఆ ప్రదేశంలో కాస్త గుంటగా వుండి నీరు ఊరుతూ వుంటుంది. అందులో చిన్నవిగా వుండే మూడు సాలగ్రామ శివలింగాలను వుంచి అర్చక స్వాములు పూజిస్తూ వుంటారు.

కార్తిక పౌర్ణమి ... మహాశివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా స్వామివారిని సర్వాభరణాలతో అలంకరించి ఊరేగిస్తారు. ఈ స్వామికి పాండవుల కాలంలో వజ్ర కిరీటం సమర్పించబడింది ... ఆ కిరీటాన్ని కూడా దర్శించవచ్చు. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. ఈ సందర్భంలో లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి తరలి వస్తుంటారు ... స్వామివారిని దర్శించి తరిస్తుంటారు.

More Bhakti Articles