కేదార్ నాథ్

కేదార్ నాథ్
ద్వాదశ జ్యోతిర్లింగాలలో అయిదవ జ్యోతిర్లింగంగా 'కేదార్ నాథ్'క్షేత్రం అలరారుతోంది. ఉత్తర భారతదేశంలో నెలకొని ఉన్న గంగోత్రి .. యమునోత్రి .. కేదార్ నాథ్ ... బదరీ నాథ్ క్షేత్రాలను 'చార్ ధామ్'గా వ్యవహరిస్తుంటారు. ఇక్కడికి వచ్చే యాత్రీకులు ఈ నాలుగింటిని దర్శించుకుని వెళుతుంటారు. కేదార్ నాథ్ విషయానికే వస్తే అత్యంత శక్తిమంతమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రాన్ని దేవతలు ... రుషులు అదృశ్య రూపంలో అర్చిస్తూ ఉంటారని చెబుతుంటారు. ఈ జ్యోతిర్లింగం సముద్ర మట్టానికి 12,000 కిలోమీటర్ల ఎత్తులో హిమాలయ శిఖరంపై కొలువుదీరి కనిపిస్తుంది.

నరనారాయణుల కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ కొలువుదీరినట్టు పురాణాలు చెబుతున్నాయి. గర్భాలయంలో శివలింగం 'త్రికోణం'ఆకారంలో కనిపిస్తూ వుంటుంది. ఇది మహిష పృష్ట భాగమంటూ పాండవులతో ముడిపడిన ఓ కథ ప్రచారంలో వుంది. ఈ కథ నిజమని భావించేలా ఈ పరిసర ప్రాంతాల్లో పాండవులకి సంబంధించిన అనేక ఆనవాళ్లు కనిపిస్తూ వుంటాయి. దాదాపు 22,000 అడుగుల ఎత్తుగల ఇక్కడి 'నీలకాంత శిఖరం'పై పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షంగా కొలువుదీరి ఉంటారని అంటుంటారు.

కేదార్ నాథ్ పర్వత సానువులలో ఉద్భవించిన 'మందాకిని'నది ... 'బదరీ నాథ్ లో ఉద్భవించిన 'అలకనంద' నదిలో కలుస్తుంది. ఇక్కడి 'గౌరీ కుండ్' మహా విశిష్టమైనదిగా చెబుతుంటారు. కేదార్ నాథ్ కి 'గౌరీ కుండ్'నుంచి బయలుదేరవలసి వుంటుంది. మంచుకొండలపై నుంచి వచ్చే నీళ్లు చాలా చల్లగా వుంటాయనే విషయం తెలిసిందే. అయితే ఇక్కడి గౌరీ కుండ్ లోని నీరు గోరువెచ్చగా వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

భీముడు నిర్మించినట్టుగా చెబుతోన్న ఈ దేవాలయంలో ... ఆ తరువాత కాలంలో శ్రీ ఆది శంకరాచార్యుల వారు యంత్ర స్థాపన చేశారు. శ్రీ ఆది శంకరులవారు తాము అవతరించిన కార్యం పరిసమాప్తమైన కారణంగా ఇక్కడి నుంచే కైలాసానికి వెళ్లారని చెబుతుంటారు. కష్టతరమైన ప్రయాణ మార్గం కావడం వలన పూర్తి ఆరోగ్యవంతులు ... నడి వయసు దాటనివారు మాత్రమే ఈ ప్రయాణానికి సిద్ధపడాలి.

కేదారేశ్వరుడిని భక్తులు దర్శించి ... స్వయంగా అభిషేకించి ... శివలింగం పై భాగాన నెయ్యితో పూస్తూ ఆయనను స్పర్శించి పులకించిపోతారు. ఈ యాత్రలో తాము పడిన కష్టాలను మరిచిపోతారు. ఇక్కడి స్వామిని దర్శించినా ... స్పృశించినా మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

More Bhakti Articles