శ్రీ సరస్వతీ దేవి వ్రతం

శ్రీ సరస్వతీ దేవి వ్రతం
సాధారణంగా 'సరస్వతీ వ్రతం'అనగానే ... కేవలం విద్యాభివృద్ధి కోసం మాత్రమే చేసేదని అనుకుంటారు. కానీ ఈ వ్రతం విద్యా విషయంగానే కాకుండా, అనుకున్నది సాధించడానికీ ... ఆయురారోగ్యాలను ప్రసాదించడానికి చెప్పబడుతోంది. అందుకు ఉదాహరణగా నిలిచే కథ కూడా కనిపిస్తోంది.

పూర్వం సుకేతుడనే రాజు తన మంచితనంతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రజలంతా కూడా కష్టపడి పనిచేయడంతో ఆ రాజ్యం సకల సంపదలతో తులతూగసాగింది. దాంతో శత్రువులైన సామంత రాజులంతా ఒక్కటై సుకేతుడిపై యుద్ధం ప్రకటించారు. మోసాన్ని చివరి నిమిషంలో గ్రహించిన సుకేతుడు తన భార్య సువేదితో కలిసి అడవులకు పారిపోయాడు.

అక్కడ వారికి అంగీరసముని తారసపడి జరిగినదంతా తెలుసుకున్నాడు. తాము చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామనీ, బయటపడే మార్గాన్ని చెప్పమని వాళ్లు ఆయన్ని కోరారు. అక్కడికి దగ్గరలోని పంచవటి తీరంలో లక్ష్మీ - దుర్గల శక్తిని సంతరించుకున్న మహా సరస్వతి కొలువుదీరి ఉందనీ, ఆమెను పూజించడం వలన ఎలాంటి కష్టాలైనా వెంటనే తొలగిపోతాయని ఆయన చెప్పాడు. అంతే కాకుండా తాను తోడుగా ఉండి ఆ దంపతులను అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లాడు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు మహా నవమి వరకూ అమ్మవారికి కుంకుమ పూజలతో పాటు ... క్షీరాన్నంతో హొమం చేయించాడు. ఫలితంగా సువేది గర్భం ధరించి ... ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి సూర్యప్రతాపుడనే పేరుపెట్టి రహస్యంగా యుద్ధవిద్యలు నేర్పించారు. యవ్వనంలోకి అడుగు పెట్టిన సూర్య ప్రతాపుడు శత్రువులను తరిమివేసి తమ రాజ్యాన్ని తిరిగి హస్తగతం చేసుకున్నాడు. దాంతో సువేది దంపతులు దీనంతటికీ కారణమైన సరస్వతీ దేవి వ్రతాన్ని ప్రతి ఏడాది నిర్వహించి సుఖసంతోషాలతో జీవనాన్ని కొనసాగించారు.

More Bhakti Articles