అష్టలక్ష్మీ వ్రతం

అష్టలక్ష్మీ వ్రతం
సకల సంపదలను ... సుఖ సంతోషాలను ప్రసాదించే వ్రతాల్లో 'అష్టలక్ష్మీ వ్రతం' మనకు ముందు వరుసలో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని గురు - శుక్ర వారాల్లో దశమి .. ఏకాదశి .. త్రయోదశి పూర్ణిమ తిధులతో కూడి వచ్చినప్పుడు ప్రారంభించాలి. ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉపవాసం ఉండి, ఆ తరువాత మూడు గంటలలోగా పూజను పూర్తిచేయవలసి వుంటుంది. ఇలా ఎనిమిది వారాలపాటు చేసి చివరివారం ఉద్యాపన చెప్పుకోవాలి.

వ్రతాన్ని ఆరంభించిన రోజున తలస్నానం చేసి ... పూజా మంటపాన్ని ఏర్పాటు చేసుకొని ... పీఠంపై నవధాన్యాలను సమానంగా పరిచి దానిపై కుడి చేయి మధ్య వేలితో అష్టదళ పద్మం గీసి మధ్యలో కలశ స్థాపన చేయాలి. కలశం చుట్టూ అష్టకళను ఏర్పాటు చేసి ఎనిమిది రకాల తీపిపదార్ధాలను ... వడపప్పు - పానకాలను నైవేద్యంగా సమర్పించాలి.

ఇక ఈ వ్రతానికి కారణమైన కథ గురించి తెలుసుకుందాం. భ్రుగు మహర్షిని అనుగ్రహించిన ఆదిపరాశక్తి అతని ఇంట అమృత కళగా ... మృతకళగా జన్మించింది. అమృతకళకి లక్ష్మీదేవి అనీ ... మృతకళకు జ్యేష్టాదేవి అని ఆయన నామకరణం చేశాడు. ఇద్దరు అక్కచెల్లెళ్లకి క్షణంసేపు కూడా పడేదికాదు. వయసుతోపాటు మనస్పర్థలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఒకరు వుంటే మరొకరు ఇంట్లోకి అడుగుపెట్టని పరిస్థితి వచ్చింది.

అలాంటి సమయంలోనే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు మనసిచ్చింది. అక్కపై అసూయతో శ్రీ మహా విష్ణువును ఆకట్టుకోడానికి ప్రయత్నించిన జ్యేష్టాదేవికి నిరాశే మిగిలింది. ఆ కోపంతో .. సముద్ర గర్భంలో నివసించమంటూ ఆమె లక్ష్మీదేవిని శపించి, తాను భూమిని ఆక్రమించుకుంది. ఏం చేయాలో పాలుపోని మహర్షి, మహా విష్ణువును ఆశ్రయించాడు. దాంతో ఆయన రావిచెట్టుకింద జ్యేష్టా దేవికి నివాసస్థానం చూపించి, లక్ష్మీదేవిని సముద్ర గర్భం నుంచి పైకి తీసుకొచ్చి తన హృదయంలో స్థానం కల్పించాడు.

ఆ తరువాత భక్తులకు అందుబాటులో వుండటం కోసం ఆమె అంశను ఎనిమిది కళలు(అష్ట లక్ష్ములు) గా విభజించాడు. ఫలితంగా ఏ కళకు సంబంధించిన అమ్మవారి అనుగ్రహం అవసరమైనా, ఆ అమ్మవారి పరంగా అష్టలక్ష్ములను పూజించే అవకాశం కలిగింది. ఆ రోజు నుంచి అష్టలక్ష్ములను తలుస్తూ ... కొలుస్తూ ఎందరో తమ జీవితాలను ఆనందమయం చేసుకుంటున్నారు.

More Bhakti Articles