కుజగౌరీ వ్రతం

కుజగౌరీ వ్రతం
వివాహం ఆలస్యమవుతున్న వాళ్లు ... వివాహమై సుఖ సంతోషాలు లేని వాళ్లు ఆచరించదగిన వ్రతంగా 'కుజగౌరీ వ్రతం'చెప్పబడుతోంది. ఈ వ్రతం ప్రతి నెలా శుక్ల పక్షంలోని మంగళవారం రోజున జరుపుకోవాలి. ఇలా అయిదు నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించి ఆరో నెల తొలివారంలో ఉద్యాపన చెప్పుకోవాలి. ఈ వ్రతాన్ని గురించి లోకానికి తెలియడానికి కారణ మైన కథ ఒకటి ప్రచారంలో ఉంది.

పూర్వం చిత్రకర్ణుడు అనే రాజు ఆవును దైవ స్వరూపంగా భావించి ఆరాధించే వాడు. తన కోటలోని గోశాలకి ప్రతి నిత్యం వెళ్లి వాటికి నమస్కరించిన తరువాతే తన దైనందిన వ్యవహారాలు చూసుకునేవాడు. ఆ మందలో కపిల గోవు పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. ఒక రోజున ఆ గోశాలకి సంబంధించిన ఆవులన్నీ మేతకెళ్లి తిరిగొచ్చాయి కానీ కపిలగోవు మాత్రం తిరిగి రాలేదు. దాంతో కంగారు పడిపోయిన కాపలాదారులు ఆ విషయాన్ని రాజుగారి దృష్టికి తీసుకు వెళ్లారు.

కపిలగోవు ఎక్కడున్నా వెంటనే వెదికి పట్టుకు రమ్మని రాజుగారు తన మనుషులను నలు దిక్కులకు పంపాడు. అయితే ఈలోగానే మందలో నుంచి తప్పిపోయిన ఆవు చనిపోయింది. దాని మరణానికి కారకులైన దంపతులను భటులు రాజు ఎదుట ప్రవేశపెట్టారు. కపిలగోవు చనిపోయిందని తెలిసి తల్లడిల్లి పోయిన రాజు, అందుకు కారకుడైన వాడికి శూల దండన వేయమని ఆదేశించాడు. ఆవును చనిపోయిన ప్రదేశంలోనే ఆ దండనని రాజభటులు అమలు పరిచారు.

విగత జీవుడై శూలానికి వేలాడుతోన్న భర్తను చూసి అతని భార్య రోదిస్తూ ఉండటాన్ని అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు చూశారు. ఆమె భర్తతో పాటు ఆవు కూడా బతుకుతుందనీ, అందుకు 'కుజగౌరీ వ్రతం'చేసుకోమని చెప్పారు. ఆది దంపతుల సూచన మేరకు ఆమె ఆ వ్రతం చేసుకోగానే, భర్తతో పాటు ఆవు కూడా తిరిగి బతికింది. ఆమె ద్వారా ఈ సంగతి తెలుసుకున్న రాజు కూడా తన భార్యతో ఈ వ్రతాన్ని చేయించాడు.

ఆరో నెలలోని శుక్ల పక్షపు తొలి మంగళవారం పది మంది ముత్తైదువులకు 'మినప సున్నుండలు' వాయన మిచ్చి... పది నమస్కారాలు ... పది ప్రదక్షిణలు సమర్పించి ఉద్యాపన చెప్పుకోవాలి.

More Bhakti Articles