వ్రత పద్ధతులు

వ్రత పద్ధతులు
దైవమేదైనా ... పూజ ఏదైనా ... ప్రతిదానికి ఒక పద్ధతి ... నియమావళి అనేది వుంటుంది. ఆ నియమానుసారంగానే ఆయా పూజలు చేయవలసి వుంటుంది. అప్పుడే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది ... అనుకున్న ఫలితం పొందడం జరుగుతుంది. ఇక రోజువారీగా ఇంట్లో చేసుకునే పూజలను మినహాయిస్తే, పండుగలు ... పర్వదినాల్లోను ... నోములు - వ్రతాలు జరుపుకునే సమయంలో ఈ నియమాలను తప్పనిసరిగా ఆచరణలో పెట్టవలసి వుంటుంది.

సాధారణంగా స్త్రీలు నోములు గానీ ... వ్రతాలు గాని చేసుకునేటప్పుడు పేరంటాళ్లు వస్తుంటారు. అలా వచ్చిన వారిలో ఆర్ధికపరమైన తారతమ్యాలు ఉండొచ్చు ... కొందరి మధ్య అభిప్రాయబేధాలు ఉండొచ్చు. కానీ ఇలాంటివాటికి వ్రత ప్రదేశం ఎట్టి పరిస్థితుల్లోను వేదిక కాకూడదు. చుట్టుపక్కలున్న వారితోగల మనస్పర్థలు దృష్టిలో పెట్టుకుని, ఎవరినీ పిలవకుండా వ్రతం చేసుకోకూడదు. నిజానికి అలాంటి మనస్పర్ధలను తుడిచేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు.

వ్రతం చేసుకోవాలనుకున్నరోజు ఉదయాన్నే శుచియై, పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసుకోవాలి. ఒక్కొక్కరిగా వస్తోన్న పేరంటాళ్లను ఆప్యాయంగా ఆహ్వానించాలి. తాను మనసులో గౌరీదేవిని నిలుపుకుని, మిగతావారి దృష్టి కూడా పూజా మందిరంపై ఉండేలా చేయాలి. అహంభావపూరితమైన మాటలు ... గొప్పతనాన్ని చాటుకునే పనులు చేయకూడదు.

అనుకోని కారణాల వలన వ్రతానికి రాలేకపోయిన వారి గురించి వేరొకరి దగ్గర చులకనగా మాట్లాడకూడదు. వచ్చిన వారంతా లక్ష్మీ స్వరూపాలుగా భావించి పసుపు కుంకుమలతో ... వాయనాలతో సంతోషపెట్టాలి. వారి ఆశీస్సులను మించిన వరం లేదన్నట్టుగా వ్యవహరించాలి. ఇలాంటి నియమాలను అనుసరిస్తూ నిస్వార్ధంతో ... నిర్మలమైన హృదయంతో చేసే వ్రతాలు మాత్రమే మంచి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని మరిచిపోకూడదు.

More Bhakti Articles