కొబ్బరికాయ

కొబ్బరికాయ
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో కొబ్బరికాయకి ఓ విశిష్టత ఉంది. కొబ్బరి కాయలేని దైవకార్యంగానీ, శుభకార్యంగాని ఎక్కడా కనిపించవు. ఏ శుభకార్యమైనా కొబ్బరికాయ కొట్టడంతోనే మొదలవుతుంది. ఇక దైవ కార్యాలు కూడా కొబ్బరికాయ కొట్టడంతోనే మొదలవుతాయి.

దేవుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు ... కొబ్బరిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు. ఇక నోములు ... వ్రతాల సమయంలో కొబ్బరికాయలోకి దైవాన్ని ఆవాహన చేస్తారు. ఇలా భారతీయుల పూజా విధానంలో కొబ్బరికాయ ఎంతో పవిత్రమైన స్థానాన్ని సంపాదించుకుంది.

కొబ్బరి కాయకు మూడు కన్నులు వుండటం వలన దీనిని 'ముక్కంటి కాయ'అని కూడా అంటారు. కొబ్బరి కాయను కొట్టడం వలన అది రెండు చిప్పలుగా పగిలిపోతుంది. ఈ రెండింటిని దేవుడికి ... జీవుడికి ప్రతీకగా భావించడం జరుగుతుంది. కొబ్బరికాయకి గల మూడు కన్నుల్లోను 'బ్రహ్మనాడి'గా చెప్పుకునే పై భాగంలోని కన్ను నుంచి మాత్రమే నీరు బయటికి వస్తుంది. 'బ్రహ్మనాడి'ద్వారానే జీవుడు పరమాత్ముణ్ణి చేరుకోగలుగుతాడనే విషయాన్ని కొబ్బరికాయ తెలియజేస్తోంది.

ఇక ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా కొబ్బరి తల్లికన్నా ఎక్కువ మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కొబ్బరి కాయ ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. మూత్ర సంబంధమైన వ్యాధులకు ... పార్శ్వపు నొప్పులకు ... అతిసారానికి కొబ్బరి దివ్య ఔషధంలా పని చేస్తుంది. ఈ కారణంగానే కొబ్బరిని కూరల్లో కలిపి వాడటం జరుగుతోంది. కొబ్బరి నీళ్లే కాదు ... కొబ్బరి నూనె కూడా ఎంతో ఉపయోగకారి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మెదడును చల్లబరిచడమే కాకుండా, మేధాశక్తిని పెంచుతుంది. చర్మ సంబంధమైన వ్యాధులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

ఆరోగ్యాన్ని ... ఆధ్యాత్మికపరమైన సందేశాన్ని ఇచ్చే కొబ్బరి మన ఆచారాల్లో ప్రధానమైన స్థానాన్ని దక్కించుకుంది. అలాంటి కొబ్బరికి ప్రతి ఒక్కరూ ఎంతో రుణపడి ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles