అటు ఇటు తిరిగే హనుమంతుడు !

ఏ ఆలయంలోనైనా భగవంతుడు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసించాలంటే, ఆశ్చర్యచకితులను చేసే కొన్ని సంఘటనలు భక్తుల అనుభవంలోకి వస్తుండాలి. అప్పుడే ఆ ఆ భక్తుల విశ్వాసంతో పాటు ... ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వుంటుంది. అలా ఆలయ అర్చకులతో పాటు అక్కడ నిద్రచేసిన భక్తులను కూడా ఆశ్చర్యచకితులను చేసే హనుమంతుడి ఆలయం మనకి నల్గొండ జిల్లా 'కోదాడ'లో కనిపిస్తుంది.

ఇక్కడి హనుమంతుడు అభయముద్రను కలిగి చక్కని ఆకారంలో దర్శనమిస్తూ వుంటాడు. ఇక్కడ ఆలయం నిర్మించి చాలాకాలమే అవుతున్నా, స్వామి విగ్రహం మాత్రం చాలా పురాతనమైనదిగా చెప్పబడుతోంది. ఒకప్పుడు అడవీ ప్రాంతంలో గల ఈ విగ్రహనికి పూజలు లేకపోవడంతో, అక్కడి గిరిజనులే నైవేద్యాలు పెడుతూ ఉండేవాళ్లట. కాలక్రమంలో అక్కడి గిరిజనులు ఈ ప్రాంతానికి వలస రావడం జరిగింది.

ఆ సమయంలోనే ఇక్కడి ఆలయ నిర్మాణం పూర్తవుతూ వుండటం, అక్కడి గిరిజనులు ఇచ్చిన సమాచారంతో ఈ విగ్రహాన్ని తెప్పించడం జరిగిందని చెబుతారు. స్వామి మహిమాన్వితుడనీ, మహర్షులు ... సిద్ధులు మొదలైన వాళ్లచే పూజలు అందుకుని ఉంటాడని భావిస్తారు. ఇక స్వామివారు ప్రతి రోజు ఉదయం రెండు గంటల సమయంలో ఆలయంలో నుంచి బయటికి వెళుతున్నట్టుగా అడుగులు చప్పుడు వినిపిస్తూ ఉంటుందట. అలాగే ఉదయం నాలుగు గంటలకు తిరిగి గర్భాలయంలోకి వెళుతున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపిస్తూ ఉంటుందట.

బలమైన వ్యక్తి గంభీరంగా నడచినట్టుగా ఈ చప్పుడు వినిపిస్తూ ఉంటుందని అర్చకులతో పాటు కొంతమంది భక్తులు చెబుతుంటారు. ఈ కారణంగా స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువుదీరాడని భక్తులు విశ్వసుస్తుంటారు. హనుమంతుడి అనుగ్రహాన్ని కోరుతూ, గ్రహ దోషాలకు సంబంధించిన హోమాలను ఇక్కడ నిర్వహిస్తుంటారు.


More Bhakti News