సాలగ్రామము

సాలగ్రామము
'సాలగ్రామము' ఎంతో పవిత్రమైనది ... మరెంతో మహిమాన్వితమైనది. కొన్ని సాల గ్రామాలు చిన్నవిగా వుంటే మరికొన్ని కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఎన్నో రంగుల్లో ... మరెన్నో ఆకారాల్లో కనిపించే సాలగ్రామాలు, చూడటానికి చిన్నపాటి శివలింగాలుగా ముచ్చటగా కనిపిస్తూ వుంటాయి. అయితే వీటిలో విష్ణు సంబంధమైన చిహ్నములు గలవి ... శివ సంబంధమైన చిహ్నములుగలవి వుంటాయి. శివకేశవులకు ప్రతీకలుగా కనిపించే ఈ సాలగ్రామాలు ఎంతో విశిష్టమైనవి.

సాలగ్రామాలు ఉండదగిన ప్రదేశాలు దేవాలయాలు మాత్రమేననీ, వాటిని ఇంట్లో పెట్టుకుని పూజించరాదనే అపోహ కారణంగానే చాలామందికి వాటి మహిమ తెలియకుండా పోతోంది. దేవాలయాల్లో విశేషమైన రోజుల్లో ఉత్సవ మూర్తులతో పాటు సాలగ్రామాలకు కూడా అభిషేకం చేయడాన్ని అంతా భక్తితో చూస్తారుగాని, మిగతా సమయాల్లో వాటి దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తుంటారు.

ఇక సాలగ్రామాలు వుంటే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ... పూజామందిరాన్ని పవిత్రంగా ఉంచాలి. ఆ కుటుంబ సభ్యులందరూ కాస్త నిష్టగా ఉండాలనే నియమాల కారణంగానే చాలామంది వాటిని ఇంటివరకూ తీసుకువచ్చే సాహసం చేయరు. కానీ నిజానికి సాలగ్రామం ఇంట్లో వుండటం ఎంతో క్షేమదాయకం. సాలగ్రామానికి అభిషేకించిన జలాన్ని తీర్థంగా తీసుకోవడం మరెంతో ఆరోగ్యకరం.

సాధారణంగా ఈ సాలగ్రామాలు నేపాల్ - ఖాట్మండు ప్రాంతంలోని గండకీ నదీ తీరంలోనూ ... నర్మదానది తీరంలో మాత్రమే లభిస్తాయి. ఇక ఇవి ముత్యాలు ... పగడాలు ... శంఖాలు ... మాదిరిగానే సముద్రపు జీవి అయిన ఒక పురుగు వల్ల తయారవుతాయి. పురుగు కారణంగా ఏర్పడిన ఈ గుండ్రని పదార్ధం కొన్ని సంవత్సరముల తరువాత ఔషధ గుణాలను సంతరించుకుంటూ గట్టిపడి రాయి లక్షణాన్ని పొందుతుంది. అందువలన ఈ సాలగ్రామాన్ని అభిషేకించిన తీర్థాన్ని స్వీకరించడం వలన వ్యాధులు దూరమవుతాయి.

ఇక ఈ సాలగ్రామాలకి చిన్న రంధ్రం ఒకటి ఉంటుందనీ, ఆ రంధ్రం గుండా చూసి లోపల ఉన్న చిహ్నాలను బట్టి అది శివుడికి చెందినదా ? విష్ణువుకి చెందినదా ? అనేది గుర్తించడం జరుగుతుందని అంటూ వుంటారు. అందువలన సాలగ్రామం ఇటు ఆరోగ్యపరమైన ... అటు ఆధ్యాత్మిక పరమైన మేలు చేస్తుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి సాలగ్రామం విషయంలో లేనిపోని సందేహాలకు తావీయక, వాటిని పూజా మందిరాలలో వుంచి పూజించుకోవచ్చును.

More Bhakti Articles