అక్షింతలు

అక్షింతలు
మన సంస్కృతీ సంప్రదాయాల్లో ... ఆచార వ్యవహారాల్లో 'అక్షింతలు' ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాయి. ఇటు శుభకార్యాలలోను ... అటు దైవ కార్యాల్లోను అక్షింతలకు ఒక విశిష్టమైన స్థానం వుంది. పిల్లలకి సంబంధించిన వేడుకల్లో వాళ్ల తలపై పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటారు. వివాహ సమయంలో వధూవరుల తలపై అంతా అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేస్తుంటారు. ఇక గురువులు ... పీఠాధిపతులు వీరంతా కూడా తమ దర్శనార్ధం వచ్చిన వారి తలపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటారు.

ఇలా అక్షింతలు ఆశీస్సులతో ముడిపడి అన్నిరకాల శుభకార్యాలలో మహోన్నతమైన పాత్రను పోషిస్తూ వస్తున్నాయి. 'అక్షితలు'అంటే కొసలు విరగని బియ్యం ... వాటిలో పసుపు కలపడం వలన అవి మరింత పవిత్రతను సంతరించుకుంటాయి. బియ్యం చంద్రుడికి చెందిన ధాన్యం ... చంద్రుడు మనః కారకుడు కావడం వలన, అతనికి చెందిన బియ్యం కూడా మనస్సు పై ప్రభావం చూపుతాయి.

ప్రతివారి శరీరంలోనూ ఒక విద్యుత్ కేంద్రం ఉంటుంది. ఆశీర్వాదం చేయడం కోసం మంత్రాక్షింతలు చేతుల్లోకి తీసుకున్నప్పుడు, వారి దేహంలోని కొంత విద్యుత్ అక్షింతల్లోకి చేరుతుంది. ఆ అక్షింతలను తలపై వేసినప్పుడు విద్యుత్ పరావర్తనం చెంది సాత్విక గుణ వర్గీకరణ జరుగుతుంది. మానవుడిలో తల భాగంలోనే విద్యుత్ ఉత్పత్తి జరిగి అది దేహానికి ప్రసారమవుతూ వుంటుంది. ఈ కారణంగానే తలపై అక్షింతలు వేస్తుంటారు.

ఇక చర్మ సంబంధమైన వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా అక్షింతల్లో పసుపు కలుపుతూ వుంటారు. తరతరాలుగా మన ఆచార వ్యవహారాల్లో ఒక భాగమైపోయిన అక్షింతల వెనుకగల అసలైన అర్ధం ఇదే.

More Bhakti Articles