పూజలు - పూలు

పూజలు - పూలు
పూలు-పూజ ఈ రెండింటిని విడదీసి చూడలేము. పూజకు వాడని పూలు నిరర్ధకమైతే ... పూలులేని పూజకు సార్ధకతే లేదు. పూల రకాలు ఎన్నయినా అవి పూసేది మాత్రం దేవుడి కోసమే. దైవానికి అలంకరణ చేయడం దగ్గర నుంచి పూజలోని ప్రతి అంశం పూవులతో ముడిపడి వుంటుంది. ఏవో ఒకటి రెండు తప్ప మిగతా పూలన్నీ పూజలలో ఉపయోగిస్తూ వుంటారు.

ఎన్ని రకాల పూవులు ఉన్నప్పటికీ వాటి రంగు - గుణం - సువాసనబట్టి ఉత్తమమం ... మధ్యమం ... అధమం అని చెప్పబడుతున్నాయి. ఇక దేవతలకి ఇష్టమైన పూవులతో పూజించడం కూడా కోరిన ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. కలువ పూలతో శ్రీ మహాలక్ష్మిని ... తెల్లనిపూలతో సరస్వతీదేవిని ... పసుపు రంగు పూలతో పార్వతీదేవిని పూజించాలని అంటారు.

ఇక పారిజాత పూవులతో శ్రీ చక్రాన్ని పూజిస్తే మంచిదనీ ... శివుడిని బిల్వ పత్రాలతో పూజిస్తే మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు తెలియజేస్తున్నాయి. దేవాలయానికి వెళ్లి దైవానికి సమర్పించే పూలు స్వచ్ఛంగా ... పవిత్రంగా వుండాలి. పూలను కోసేటప్పుడు అవి దైవం కోసమని ఆ పూలచెట్టుకు చెప్పి కోయాలి ... వాటి వాసన చూడకూడదు.

ఇక స్వయంగా పూజించవలసి వస్తే, పూవులు ఏవైనప్పటికీ వాటిని వ్రేళ్లతో తీసుకుని విగ్రహాలపై చల్లకూడదు. ముందు రోజు సమర్పించగా వాడిన పూలను కుడిచేయి బొటనవ్రేలు ... చూపుడు వ్రేలుతో కలిపి తీసేయాలి. తాజా పూవులను బొటనవ్రేలు ... మధ్య వ్రేలు ... ఉంగరం వ్రేలుతో కలిపి దైవం పాదాలచెంత సమర్పించాలి.

ఒక్కో పువ్వును దైవం పాదాల చెంత వుంచేటప్పుడు అవి బోర్లా పడకుండా చూడాలి. ఇక దోసిలితో అభిషేకించేటప్పుడు పూలు బోర్లాపడినా దోషం వుండదు. ఎంతటి వినయ విధేయతలు ... భక్తి శ్రద్ధలతో పూవులను సమర్పిస్తే, అంతటి ఫలితముంటుందనేది రుషి వాక్యం.

More Bhakti Articles