చనిపోయినవారిని బతికించడం సాధ్యమేనా ?

అనంతమైన ఈ విశ్వంలోకి ఓ ప్రాణిగా ప్రవేశించాక శోకము ... మరణము ఎంతటివారికైనా తప్పవు. మృత్యుదేవత సమీపించకుండా ఎవరూ ఆపలేరు ... ఎవరూ ఎవరి ఆయువును ఒక్క క్షణమైనా పెంచలేరు. అలాంటిది ఆదిశంకరాచార్యులు ... రాఘవేంద్రస్వామి వంటి వారు మరణించిన వారిని బతికించిన దాఖలాలు కనిపిస్తుంటాయి. జీవుడు ఒకసారి శరీరాన్ని వదిలివేసిన తరువాత, తిరిగి ఆ శరీరంలో ప్రవేశించడం అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని వాళ్లు సుసాధ్యం చేసి ఆధ్యాత్మిక చరిత్రలో అరుదైన స్థానాన్ని దక్కించుకున్నారు.

ఇక తిరుజ్ఞాన సంబంధర్ మరోఅడుగు ముందుకు వేసి, దహన సంస్కారాలు జరిగిపోయిన వ్యక్తిని జీవింపజేసి తీసుకు వచ్చాడు. తిరుజ్ఞాన సంబంధర్ అనునిత్యం ... అనుక్షణం శివారాధనలో తరించిన 63 మంది నాయనార్లలో అగ్రస్థానంలో కనిపిస్తాడు. అలాంటి సంబంధర్ విశిష్టమైనటు వంటి అనేక శైవ క్షేత్రాలను దర్శిస్తూ, 'తిరువట్టూరు' చేరుకుంటాడు.

అదే సమయంలో పాముకాటు కారణంగా కూతురు చనిపోవడంతో దహన సంస్కారాలు జరిపించి వచ్చిన ఓ కుటుంబ సభ్యులు అదేపనిగా విలపిస్తూ ఉంటారు. చనిపోయిన యువతితో తాము పెంచుకున్న అనుబంధాన్ని తలచుకుంటూ గుండెలవిసేలా ఏడుస్తుంటారు. ఆ దృశ్యం చూడగానే సంబంధర్ హృదయం బరువెక్కుతుంది. సంబంధర్ ని చూడగానే, భగవంతుడు తమకి అన్యాయం చేశాడంటూ వాళ్లు మరింతగా బాధపడుతూ ఉంటారు.

సంబంధర్ వాళ్లని అనునయిస్తూ ... చనిపోయిన యువతి అస్థికలు తీసుకురావలసిందిగా చెబుతాడు. అపారమైన ఆయన శక్తి పట్ల నమ్మకంతో వాళ్లు ఆ పని చేస్తారు. ఆ ఎముకలను యువతి ఆకారంలోనే పేర్చి పరమశివుడిని ప్రార్ధిస్తాడు సంబంధర్. అంతే .. అంతా చూస్తుండగానే ఆ ఎముకలు ఆ యువతి రూపాన్ని సంతరించుకుని .. ప్రాణం పోసుకుని నిద్రలో నుంచి మెలకువ వచ్చినట్టుగా లేచి కూర్చుంటుంది. తిరుజ్ఞాన సంబంధర్ సాక్షాత్తు శివుడని భావించిన అక్కడి వాళ్లంతా ఆయన పాదాలకి వినయంగా నమస్కరిస్తారు.


More Bhakti News