కార్తీక గురువారం

కార్తీక గురువారం
సకల సంపదలను ... సంతానాన్ని కోరుకునే వారికి 'కార్తీక గురువారం నోము' చెప్పబడింది. ఇక ఈ నోముకి సంబంధించిన ప్రాధాన్యతను ... మహాత్మ్యాన్ని తెలియజేసే కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఓ ఊళ్లో ఉత్తమురాలైన ఓ ఇల్లాలు వుండేది. వినయ విధేయతలకు ... భక్తి శ్రద్ధలకు ప్రతి రూపంగా ఆమె కనిపించేది. ఆమె భర్త నిరంతరం దైవ ధ్యానంలోనే కాలం గడిపేవాడు. ఫలితంగా సంపాదనకి ... సంతానానికి కూడా వాళ్లు దూరమై పేదరికంతో రోజులు వెళ్లదీయసాగారు.

అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి వచ్చిన ఒక పండితుడి ద్వారా ఆమె 'కార్తీక గురువారం నోము'గురించి అది అందించే ఫలితాలను గురించి ఆమె మొదటిసారిగా వింది. మరుసటి రోజునే కార్తీక గురువారం కావడంతో ఆమె ఉదయాన్నే నిద్రలేచి స్నానంచేసి పూజా మందిరాన్ని శుభ్రపరిచింది. జ్యోతి స్వరూపమైన 'లక్ష్మీదేవి'ని పూజించింది. పంచామృతాల్లో ఉపయోగించే పదార్ధాలను వారానికి ఒకటి చొప్పున నివేదన చేసింది.

ఈ విధంగా అయిదు వారాలపాటు ఈ నోమును ఆచరించిన తరువాత, అప్పటి వరకూ ఒక్కొక్కటిగా చేస్తూ వచ్చిన నైవేద్యాలను ఆరోవారం మొత్తంగా నివేదన చేసి ఉద్యాపన చెప్పుకుంది. ఫలితంగా ఆమె భర్త ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఒక భర్తగా సంసారపరమైన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే, దైవారాధన చేయడం సరైనదనే నిర్ణయానికి వచ్చాడు.

ఆ రోజు నుంచి సంపాదనపై దృష్టి పెట్టి, భార్యతో ప్రేమగా మసలు కోవడం మొదలు పెట్టాడు. దాంతో కొద్ది కాలంలోనే వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, ఆ సాధ్వీమణి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

More Bhakti Articles