హోమగుండంలో అమ్మవారి ఆభరణం !

శ్రీరాఘవేంద్ర స్వామివారు తన శిష్య బృందంతో కలిసి అనేక ప్రాంతాలను దర్శిస్తూ బీజాపూర్ లోని ఓ గ్రామానికి చేరుకుంటాడు. ఆయన అక్కడ కొన్ని రోజులపాటు బస చేస్తానని చెప్పడంతో, శిష్యులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారు. ఈ విషయం అనుచరుల ద్వారా బీజాపూర్ సుల్తాన్ కి తెలుస్తుంది. స్వామిని గురించి అంతకుముందే గొప్పగా విని వుండటం వలన, మర్యాద పూర్వకంగా ఆయనకి ఖరీదైన కానుకలు పంపిస్తాడు.

ఆ సమయంలో మూలరాముడి సమక్షంలో రాఘవేంద్రస్వామివారు హోమం చేస్తుంటాడు. వజీరు అందజేసిన కానుకలలో నుంచి ఒక అమూల్యమైన ఆభరణాన్ని మాత్రమే స్వామివారు తీసుకుంటాడు. సీతమ్మ తల్లికి ఆ ఆభరణం ఎంతో బాగుంటుందని భావించి, దానిని స్వీకరించమని మనసులోనే కోరుతూ ఆభరణాన్ని హోమగుండంలోని అగ్నిలో వేస్తాడు. అగ్ని దేవుడి ద్వారా అది సీతమ్మవారికి చేరుతుందని వజీరుతో చెబుతాడు.

సుల్తాన్ ఎంతో అభిమాన పూర్వకంగా పంపించిన ఆభరణాన్ని స్వామివారు ఆ విధంగా అగ్నిలో వేయడం వజీరుకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన వెళ్లి జరిగినదంతా సుల్తాన్ తో చెబుతాడు. తనని అవమానపరచాడానికే రాఘవేంద్రస్వామి అలా చేశాడని భావించిన సుల్తాన్ ఆగ్రహావేశాలకి లోనవుతాడు. తన ఆభరణాన్ని తనకి తిరిగివ్వమని చెప్పి తీసుకురమ్మంటూ వజీరును పంపిస్తాడు. చాలా సమయం గడిచినందువలన అగ్నిలో వేసిన ఆభరణం ఎలా తిరిగి వస్తుందని ఆలోచిస్తూ ఆయన వెళ్లి, సుల్తాన్ ఆదేశాన్ని స్వామితో చెబుతాడు.

తనని సుల్తాన్ తప్పుగా అర్థం చేసుకున్నాడనీ, ఆభరణం తిరిగి ఇవ్వమంటూ మనిషిని పంపాడని సీతమ్మవారికి మనసులోనే చెబుతూ హోమగుండంలో చేయిపెట్టి ఆభరణాన్ని బయటికి తీస్తాడు రాఘవేంద్రస్వామి. ఆభరణం చెక్కుచెదరకుండా వుండటం చూసిన వజీర్ ఆశ్చర్యపోతాడు. ఆభరణాన్ని సుల్తాన్ కి అందజేసి తాను చూసిన సంఘటన గురించి ఆయనకి వజీర్ వివరిస్తాడు. తాను తొందరపాటుతో వ్యవహరించినట్టు గ్రహించిన సుల్తాన్, వెంటనే స్వామిని కలుసుకుని పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. అపరాథాన్ని మన్నించమని కోరుతూ ఆ ఆభరణాన్ని తిరిగి స్వామివారికి సమర్పిస్తాడు. చిరుమందహాసం తోనే స్వామివారు ఆయనని ఆశీర్వదించి పంపిస్తాడు.


More Bhakti News