పుట్టుమచ్చలు (వీపు - చట్టా)

'వీపు'మీద పుట్టుమచ్చ కాస్తంత పెద్దగా ... ఉబ్బెత్తుగా ఉన్నట్టయితే సమాజంలో గౌరవభిమానాలను అందుకుంటారు. వీరిలో విపరీతమైన జనాకర్షణ వుంటుంది. వీరు తమ మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ, తమ మాటలకు అందరూ కట్టుబడి ఉండేలా చేస్తారు. ఏ పదవిలో ఉన్నా ... ఏ రంగంలోవున్నా ముందుకు దూసుకుపోతూ, తమదైన శైలిలో అందరినీ ప్రభావితం చేస్తారు.

'కుడిజబ్బ'పై... 'ఎడమజబ్బ'పై పుట్టుమచ్చ వున్నా మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చ వున్న వారిలో గుండె ధైర్యం అధికంగా కనిపిస్తుంది. వీరికి మంచి మాటకారితనం ... వ్యవహార దక్షత వుంటాయి. ఎలాంటి బాధ్యతలనైనా భుజాన వేసుకుని సక్రమంగా వాటిని నిర్వర్తిస్తారు. స్త్రీలకి'కుడిజబ్బ' పై పుట్టుమచ్చ వుంటే ... దురాశాపరులుగా కనిపిస్తారు. తమ సుఖసంతోషాలకి సంబంధించిన విషయాల గురించి వీరు తీవ్రంగా ఆలోచిస్తూ వుంటారు. తాము ఆశించినవి తమకి లభించకపోవడానికి కుటుంబసభ్యులే కారణమని భావించి వారిపై చిరాకు పడుతుంటారు.

'ఎడమజబ్బ' పై పుట్టుమచ్చ ... సంతృప్తికరమైన జీవితానికి నిదర్శనంగా కనిపిస్తుంది. చక్కని సంసారం ... అందుకు తగిన సంపాదనతో వీరి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగిపోతుంది. ఇక 'వెన్ను' మీద పుట్టుమచ్చ ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఈ పుట్టుమచ్చ గలవారు సమాజంలో మంచి హోదాను కలిగి, ఆదర్శప్రాయమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ పుట్టుమచ్చ 'వెన్నుపూస' చివరన ఉన్నట్టయితే యోగాభ్యాసం పట్ల ఆసక్తినీ, మంచి ఆయురారోగ్యాలను కలిగి వుంటారు.

'కుడిచట్టా'పై పుట్టుమచ్చ కష్టనష్టాలకు గుర్తుగా కనిపిస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలుపడినా అభివృద్ధి కనిపించకపోగా, అవమానాలు ఎదురవుతూ వుంటాయి. తెలివితేటలు ఉన్నప్పటికీ అనుకున్నది సాధించలేక ఆర్ధికపరమైన ఇబ్బందులతో సతమతమైపోతుంటారు.

'ఎడమచట్టా'పై పుట్టుమచ్చ మరిన్ని కష్టాలను మోసుకొస్తుంది. వీరికి ఇతరుల సహాయ సహకారాలు లభించే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఇతర పుట్టుమచ్చల ప్రభావం కారణంగా వీరిని ఎవరైనా చేరదీసినా, జీవితంలో ఆశించిన స్థాయికి చేరుకునే అవకాశాలు అంతంత మాత్రమేనని చెప్పాలి. ఇక ఈ పుట్టుమచ్చగల స్త్రీలను కూడా ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతూ వుంటాయి. వీరు వున్నతమైన స్థానాన్ని చేరుకునే అవకాశాలు చాలా తక్కువ. పరిస్థితుల కారణంగా ఎక్కడో ఒకచోట ఏదో ఒక పనిచేసుకుంటూ వీరు కాలం గడుపుతూ వుంటారు.

More Bhakti Articles