పుట్టుమచ్చలు (నుదురు)

'నుదురు'పై పుట్టుమచ్చ వుంటే ... దాదాపు శ్రీమంతులవుతారని చెప్పవచ్చు. అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తూ, బంధు మిత్రుల నుంచి విశేషమైన గౌరవాభిమానాలను పొందుతారు. వినయ విధేయతలతో పాటుగా చక్కని దైవభక్తిని కలిగి వుంటారు. అయితే విశాలమైన నుదురు మధ్య నుంచి 'కుడి కణత వైపున'వున్న పుట్టుమచ్చలకే ఈ ఫలితం వుంటుంది. ఎడమ వైపున వున్న పుట్టు మచ్చలకు ఇందుకు భిన్నమైన ఫలితాలు వుంటాయి.

ఇక ఈ పుట్టుమచ్చ గల స్త్రీలలో దురుసుతనం ... దుడుకుతనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి. ప్రతి విషయంలోనూ తమ మాటే నెగ్గాలని వీరు పేచీ పెడుతుంటారు. ఈ విషయంలో వీరు తమ భర్తకు కూడా మినహాయింపు ఇవ్వరు. అహంకార పూరితమైన వీరి ప్రవర్తన కారణంగా అందరూ కాస్త దూరంగా ఉంటూ వుంటారు. ఒకవేళ ఈ పుట్టుమచ్చ నల్లగా కాకుండా కాస్త ఎరుపు రంగులో ఉన్నట్టయితే వీరు ఇందుకు భిన్నంగా మంచిగా ప్రవర్తిస్తారు.

'కుడి కణత'పై పుట్టుమచ్చ వుంటే ... అందమైన ... ఆదర్శవంతురాలైన భార్య లభిస్తుంది. ఈ పుట్టుమచ్చ వున్నవారికి కష్టపడి సంపాదించినదానికన్నా అనుకోకుండా హఠాత్తుగా కలిసి వచ్చే ధనమే ఎక్కువగా వుంటుంది. స్త్రీలలో ఈ పుట్టుమచ్చ ... సాధారణమైన వైవాహిక జీవితాన్ని తెలియజెపుతుంది. వీరు భర్తపట్ల అపరిమితమైన ప్రేమానురాగాలను ప్రదర్శిస్తారు. భర్త మనసెరిగి నడచుకుంటూ, కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తారు.

ఇక 'ఎడమకణత పై' వుండే పుట్టుమచ్చ ... సంపాదన ... సంసారం ... సంతానం వంటి విషయాల్లో బాగు కోరినప్పటికీ, కొంత దురదృష్టాన్ని చూపుతుంది. వీళ్లు మంచికి పోతే చెడు ఎదురవుతుంటుంది. వీళ్ల ప్రమేయం లేకుండానే బంధు మిత్రులు దూరం పెడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లు నిర్వహించే వ్యాపార వ్యవహారాలు నష్టాలను తెచ్చి పెడుతుంటాయి. ఇక స్త్రీల విషయంలోనూ ఈ పుట్టుమచ్చ చెడు ఫలితాలనే ఎక్కువగా ఇస్తుంది. చెడ్డవారితో వీరు చెలిమి చేయడమే కాకుండా, తమ బాగు కోరిన వారి మనసులను బాధపెడతారు. తక్కువ స్థాయి వారితో స్నేహం కారణంగా సమాజం దృష్టిలో పలచన అవుతారు.

'కనుబొమల' మధ్యన పుట్టుమచ్చ వుంటే ... అటు బంధు మిత్రుల్లోను ... ఇటు ప్రజలలోను మంచి పేరు ప్రతిష్ఠలు వుంటాయి. పెద్దమొత్తంలోనే సంపాదిస్తూ ... ఆనందాన్ని అనుభవిస్తూ వుంటారు. స్త్రీలకు 'రెండు కనుబొమలు కలిసేచోట' పుట్టుమచ్చ ఉన్నట్టయితే అది సకల శుభాలను సూచిస్తుంది. గుణవంతుడైన భర్తతో ... చక్కని సంతానంతో ... సిరిసంపదలతో ఆమె జీవితం సంతోషంగా సంతృప్తికరంగా సాగిపోతూ వుంటుంది.

ఇక 'కుడి కనుబొమ పైన' వుంటే ... మంచి తెలివి తేటలతో పాటు నేర్పు ... ఓర్పు కలిగి వుంటారు. తమ శక్తి సామర్ధ్యాలతో ఎలాంటి పనులైనా చక్కబెడతారు. ఇక అదృష్ట జాతకురాలు వీరికి భార్యగా లభిస్తుంది. ఆమె కారణంగా వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ జంట అన్యోన్యంగా ... ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తుంది.

'ఎడమ కనుబొమ పై' పుట్టు మచ్చ ... చాల వరకూ చెడు ఫలితాలనే ఇస్తుంది. వీరు తలపెట్టిన కార్యాలకి ఆటంకం కలగడం ... వ్యాపారాలు చేసినా కలిసి రాకపోవడం జరుగుతుంటాయి. వీరు అనుకోని ధన నష్టాలను ... అపజయాలనే కాకుండా ఒక్కోసారి తమ పైస్థాయివారి కారణంగా ఆపదలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.

More Bhakti Articles