గర్భాలయంలో గంగ

గర్భాలయంలో గంగ
వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వెళుతున్నప్పుడు, ప్రతి పుణ్యక్షేత్రంలోను ఏదో ఒక విశేషం ఆసక్తిని కలిగిస్తూ వుంటుంది. ఆ క్షేత్రంలో భగవంతుడు ప్రత్యక్షంగా కొలువుదీరి ఉన్నాడనీ, అందువల్లనే అలాంటి విశేషం చోటుచేసుకుందని భక్తులు అనుకుంటూ వుంటారు. తూర్పు గోదావరి జిల్లా 'ర్యాలి' జగన్మోహినీ కేశవస్వామిని దర్శించుకున్న భక్తులు కూడా ఇలాగే అనుకుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక్కడి సాలగ్రామ ఏకశిలలో ఒకవైపు మోహినీరూపం ... మరోవైపు కేశవస్వామి రూపం మలచబడి వుండటం విశేషం. స్వయంభువుగా చెప్పబడుతోన్న ఈ మూర్తి, భక్తుల మనసులను భారీగా దోచుకుంటూ వుంటుంది. ఇక ఈ గర్భాలయంలో గంగ అదే పనిగా నిదానంగా ఊరుతూ వుంటుంది. నిర్మాణపరంగా ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడకుండానే ఇలా నిరంతరం స్వామివారి పాదాలను గంగ స్పర్శిస్తూ వుంటుంది.

ఇక ఇదే ప్రాంగణంలో 'శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి' దర్శనమిస్తూ వుంటాడు. ఈ ప్రదేశంలో బ్రహ్మదేవుడు తన కమండలంపై ఉమాసమేతుడైన ఈశ్వరుడిని ప్రతిష్ఠించి పూజించాడు. ఈ కారణంగానే ఇక్కడి స్వామికి ఈ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. గర్భాలయంలో గల శివలింగం రుద్రాక్షను పోలి వుండటం విశేషంగా అనిపిస్తుంది.

ఇక శివలింగాన్ని అభిషేకించిన నీళ్లు ... ధారాపాత్ర ద్వారా వచ్చే నీళ్లు గర్భాలయంలో నుంచి బయటికిపోయే ఏర్పాటు లేదు. అయినా నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోతుంటాయి. అయితే ఇంకిపోవడానికి ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది. కేశవస్వామి గర్భాలయంలో అదేపనిగా గంగ ఊరుతూ వుండటం ... శివ గర్భాలయం నుంచి గంగ బయటికి పోకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోవడానికి కారణం శివకేశవుల మహిమేనని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles