మారిపోయిన రూపం !

మారిపోయిన రూపం !
శ్రీ దత్తాత్రేయస్వామి అవతారంగా చెప్పబడే అవధూతల్లో శ్రీ అక్కల్ కోట స్వామి ఒకరు. సహజంగానే అవధూతలు తమని ఫోటోలు తీయడానికి అంగీకరించరు. శిరిడీ సాయిబాబా కూడా తనని ఫోటో తీయడానికి ప్రయత్నించిన వారిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన దాఖలాలు వున్నాయి. దాంతో కొంతమంది ఆయనకి తెలియకుండా రహస్యంగా ఫోటోలు తీసేవారు.

అలాగే అక్కల్ కోట మహారాజ్ కూడా తనని ఫోటోలు తీస్తే ఊరుకునే వారు కాదు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కల్ కోట స్వామివారి దర్శనం చేసుకున్నాడు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న తరువాత, ఆయనను ఫోటో తీయబోతే అక్కడి వాళ్లు అడ్డుచెప్పారు. దాంతో ఆ యువకుడు చాటుగా వుండి వీలుచిక్కగానే మహారాజ్ ను ఫోటో తీశాడు. ఇంటికి తిరిగి వెళ్లాక ఆ ఫోటోను తన కుటుంబ సభ్యుల ముందుంచాడు.

ఎవరూ చేయని సాహసం చేసి స్వామి ఫోటో తీశాననీ వాళ్లతో గొప్పగా చెప్పాడు. అయితే ఆ ఫోటో చూసిన కుటుంబ సభ్యులకు ఎవరికీ కూడా అందులో అక్కల్ కోట మహారాజ్ రూపం కనిపించలేదు. ఒకరికి శివుడు కనిపిస్తే మరొకరికి శక్తి కనిపించింది. అదే మాట వాళ్లు చెబితే ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. తనకి మహారాజ్ కనిపిస్తున్నాడని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. స్నేహితుల దగ్గరకూడా ఆ యువకుడికి ఇదే అనుభవం ఎదురుకావడంతో అయోమయానికి లోనయ్యాడు.

మహారాజ్ తో తన్నులు తిన్నా ఫరవాలేదని నిశ్చయించుకుని, మళ్లీ అక్కల్ కోట వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. తన దగ్గరున్న ఫోటోను ఆ సమయంలోనే స్వామికి చూపిస్తూ తానే తీసినట్టుగా చెప్పాడు. స్వామి ఆ ఫోటో వంక చూసి నవ్వుతూ అందులో వున్నది తాను కాదనీ ... కోతి అని చెబుతూ తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు ఆ యువకుడు ఆ ఫోటోను చూడగా అందులో కోతి వుండటంతో ఆశ్చర్యపోయాడు. మహారాజ్ ఇష్టానికి వ్యతిరేకంగా .. దొంగచాటుగా స్వామి ఫోటో తీసినందుకే అలా రూపం మారిపోవడం జరిగిందని గ్రహించిన ఆ యువకుడు, తనని మన్నించమని కోరుతూ స్వామి పాదాలకు నమస్కరించాడు.

More Bhakti Articles