శ్రీవారి హుండీలో దాగిన చరిత్ర

శ్రీవారి హుండీలో దాగిన చరిత్ర
ఒక దేశం యొక్క ఆర్ధిక .. సాంఘిక .. రాజకీయ .. సాంస్కృతిక అంశాలు ఆ దేశ చరిత్రను ఆవిష్కరిస్తుంటాయి. ఆనాటి నిర్మాణాలే కాదు ... అప్పట్లో వాళ్లు ఉపయోగించిన నాణాలు సైతం గత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తుంటాయి. అయితే ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారుతూ వచ్చే ఈ నాణాలను సేకరించడం ద్వారా చరిత్రను తెలుసుకోవాలనుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. పూర్తి స్థాయిలో ప్రయత్నించినా ఆశించిన ఫలితం లభిస్తుందా అనేది సందేహమే.

ఇంతటి కష్టతరమైన పనిని తిరుమల శ్రీవారి హుండీ చేసిందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఇంతవరకూ ఈ హుండీ దాదాపు రెండువేల సంవత్సరాల చరిత్రను నాణాల రూపంలో తనలో దాచుకుంటూ వచ్చింది. ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రభువులను ... ఈ దేశంలో గల భక్తులను ఈ క్షేత్రం ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ కారణంగానే స్వామివారికి సమర్పించబడే కానుకల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

జీవితంలో ఒక్కసారైనా తిరుమలను దర్శించాలని అప్పట్లో అంతా అనుకునేవారు. స్వామివారిని దర్శించుకునే ఓపిక లేనివారు తాము చెల్లించవలసిన మొక్కులను అక్కడికి వెళ్లే వారితో పంపించేవారు. ఆ రకంగా వివిధ కాలాల్లో శ్రీవారి హుండీలోకి కానుకల రూపంలో నాణాలు చేరాయి. అలా క్రీ. శ.1 వ శతాబ్దం నుంచి ఆంగ్లేయుల పరిపాలనా కాలం వరకూ చెలామణిలో గల బంగారు నాణాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి.

పశ్చిమ గంగరాజులు .. పల్లవులు .. హోయసాళులు .. చోళులు .. పాండ్యరాజులు .. యాదవ రాజులు .. విజయనగర రాజులు .. అక్బర్ .. హైదర్ అలీ .. టిప్పుసుల్తాన్ .. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ముద్రించిన నాణాలు అలనాటి చరిత్రను కళ్లకు కడుతుంటాయి. ఇంతటి సుధీర్గ చరిత్రలో వివిధ కాలాల్లో చెలామణిలో గల బంగారు నాణాలను ఒకేసారి ఒకేచోట చూసే అవకాశం లభించడం సామాన్యమైన విషయం కాదు.

అలాంటి అవకాశం భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించారు. తిరుమలలో ఏర్పాటు చేయబడిన మ్యూజియంలో ఈ నాణాలు గత చరిత్రను తమలో నిక్షిప్తం చేసుకుని కనిపిస్తుంటాయి ... అరుదైన అనుభూతిని అందిస్తుంటాయి.

More Bhakti Articles