హనుమంతుడికి దెబ్బలు

హనుమంతుడికి దెబ్బలు
పూర్వం కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక అడవిలో ఆంజనేయస్వామి ఆలయం వుండేది. మహర్షుల తపోశక్తి కారణంగా అక్కడ హనుమంతుడు కొలువుదీరాడు. ఈ కారణంగా సమీప గ్రామస్తులు స్వామికి నిత్య నైవేద్యాలు ఏర్పాటుచేశారు. ఆ గ్రామానికి చెందిన పూజారి ప్రతి రోజూ ఉదయాన్నే అడవిలోని ఆంజనేయస్వామి చెంతకు చేరుకొని, పూజాభిషేకాలు పూర్తయిన వెంటనే తిరిగి గ్రామానికి చేరుకునేవాడు.

అడవిలో క్రూరమృగాల వల్లనే కాకుండా దొంగల వలన కూడా ఎక్కువ భయం వుండేది. అందువలన చీకటిపడిన తరువాత ఎవరూ కూడా అటువైపు వెళ్లేవాళ్లు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున హనుమంతుడి దగ్గరికి చేరుకున్న పూజారి, స్వామి తలపై ఏదో మూట వుండటం చూశాడు. ఆ మూట ఎవరిదో ... అక్కడ ఎవరు పెట్టారో తెలియక పూజారి అయోమయానికి లోనయ్యాడు.

అంతలో ఆ పక్కనే పడుకుని నిద్రపోతున్న ఓ సాధువు పూజారికి కనిపించాడు. కోపంతో ఆ పూజారి సాధువును నిద్రలేపి ఆ మూట గురించి అడిగాడు. ఆ మూట తనదేనని, స్వామి కాపాడతాడనే ఉద్దేశంతో ఆయన తలపై పెట్టానని ఆ సాధువు సమాధానమిచ్చాడు. దాంతో ఆ పూజారి ఆవేశంతో ఊగిపోతూ స్వామిని అవమానపరుస్తావా అంటూ కర్రతో నాలుగు తగలనిచ్చాడు.

ఆ సాధువు చిరుమందహాసాన్ని చిందిస్తూనే ఆ మూట తీసుకుని వెళ్లి ఓ పక్కన కూర్చున్నాడు. సాధువును తిట్టుకుంటూనే హనుమంతుడికి అభిషేకం చేయడానికి వెళ్లిన పూజారి ఒక్కసారిగా బిత్తరపోయాడు. తాను సాధువును ఎక్కడైతే కొట్టాడో అదే స్థానంలో హనుమంతుడి విగ్రహంపై వాతల వంటి చారలు కనిపించాయి. అవి చెరిపినా చెరగకపోవడంతో పూజారికి విషయం అర్థమైపోయింది.

వెంటనే సాధువు దగ్గరికి వెళ్లి తనని మన్నించమని కోరాడు పూజారి. ఈ లోగా అక్కడికి చేరుకున్న వాళ్ల ద్వారా ఆయన మాణిక్య ప్రభు అని తెలుసుకుని అ పూజారి మరింత బాధపడి పోయాడు. ఆవేశం అనర్థాలకు దారితీస్తుందనీ ... ప్రశాంతత దైవానికి సమీపంగా తీసుకువెళుతుందని చెప్పి మాణిక్య ప్రభు అక్కడి నుంచి బయలుదేరాడు.

More Bhakti Articles