గ్రహదోషాలు హరించే అయ్యప్ప

గ్రహదోషాలు హరించే అయ్యప్ప
హరిహరులకు జన్మించిన అయ్యప్పస్వామి అపారమైన పరాక్రమవంతుడు. బాలకుడిగానే పులిపై స్వారీ చేసి తన ధైర్య సాహసాలను ప్రదర్శించి అక్కడి ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. అడవిలోని మృగాల బారి నుంచి తమని రక్షించే దేవుడు వచ్చినందుకు అక్కడి వాళ్లు సంతోషంతో పొంగిపోయారు. శబరిమల పైనే కాదు తమ గుండెల్లోను ఆయనకి గుడి కట్టి పూజించారు.

అలా మొదలైన స్వామి ఆరాధన, అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. స్వామి మండల దీక్ష తీసుకునేవారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగిపోతోంది. దాంతో వివిధ ప్రాంతాలకి చెందిన భక్తులు తమ ఊరులో ఒక బృందంగా ఏర్పడి స్వామి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన అయ్యప్ప ఆలయాల్లో ఒకటి విజయవాడ - గొల్లపూడిలో దర్శనమిస్తుంది.

1970 తొలినాళ్లలో నిర్మించబడిన ఈ ఆలయం, సువిశాలమైన ప్రదేశంలో అందంగా తీర్చిదిద్దబడి అలరిస్తూ వుంటుంది. ఓ భక్తుడికి కలలో స్వామి కనిపించి, తనకి ఆలయం నిర్మించమని ఆదేశించాడట. ఈ విషయంలో సాధ్యాసాధ్యాల గురించి ఆలోచిస్తూ ఆయన సతమతమై పోసాగాడు. దైవ సంకల్పం కారణంగా ఈ విషయం తెలుసుకున్న ఓ శ్రీమంతుల కుటుంబం, అందుకు అవసరమైన ప్రదేశాన్ని విరాళంగా ఇచ్చింది.

దాంతో ఆలయ నిర్మాణం ఊహించిన దానికన్నా వేగంగా జరిగిపోయింది. చక్కని నగిషీలతో రూపొందించబడిన ఈ ఆలయంలోకి ప్రవేశించగానే, శబరిమల స్వామి ఎదురుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలా 18 మెట్లు ... వేదికపై స్వామి చిరుమందహాసంతో దర్శనమిస్తూ వుంటాడు. అనేక దీపకాంతుల మధ్య వెలిగిపోతోన్న ఆ దివ్య మంగళ రూపం మనోఫలకం పై ముద్రించుకుపోతుంది.

ప్రతి బుధవారం భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక మండల దీక్షల సమయంలో ఇక్కడ ప్రతి రోజూ ఓ జాతరను తలపిస్తూ వుంటుంది. ఇక్కడి అయ్యప్పను దర్శించిన వారికి గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయనీ, సంతోషకరమైన జీవితం లభిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఆ స్వామి పూజాభిషేకాల్లో పాలుపంచుకుంటూ పునీతులవుతుంటారు.

More Bhakti Articles