కృష్ణాష్టమి

కృష్ణాష్టమి
భూలోకంలో మానవుడిగా జన్మించి ప్రజలందరితోను కలిసిమెలిసి ఉంటూ దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ చేసిన అవతారం ... శ్రీ కృష్ణావతారం. తాను దేవుడినంటూ విశ్వరూపాన్ని చూపించి, సమస్త మానవాళికి 'గీతోపదేశం'చేసిన అవతారం ... శ్రీ కృష్ణావతారం. ద్వాపరయుగంలో శ్రీ ముఖ నామ సంవత్సరం దక్షిణాయన వర్ష రుతువు ... శ్రావణ బహుళ అష్టమి .. రోహిణి నక్షత్రం నాల్గో పాదం బుధవారం అర్ధరాత్రి దేవకీ వసుదేవుల బిడ్డగా శ్రీ కృష్ణుడు జన్మించాడు.

యశోద ఇంట పెరిగిన శ్రీ కృష్ణుడు అందానికి ... అల్లరికి ప్రతీకగా నిలిచాడు. బాల్యంలోనే ఎన్నో సాహసాలు చేసిన బాలకృష్ణుడు గోకులానికి నాయకుడయ్యాడు. దీన జనోద్ధరణ చేస్తూ అందరికీ ఆరాధ్య దైవమైనాడు. అలాంటి ఆ పరమాత్ముడు అవతరించిన ఈ రోజున, ఉదయాన్నే నిద్రలేచి చల్లని నీటిలో తులసీదళం వేసుకుని స్నానం చేస్తారు. ఇంటి ముందు రంగవల్లికలను తీర్చిదిద్ది ... గుమ్మాలకి పచ్చని తోరణాలను కడతారు. బాలకృష్ణుడు తమ ఇంటికి నడచి వచ్చినట్టుగా ఆయన పాదాల ముద్రలను ముగ్గుపిండితో వాకిట్లో నుంచి ఇంట్లోకి పెడతారు.

ఇక ప్రతి ఇంట్లోను ఊయలను రకరకాల పువ్వులతో అందంగా అలంకరించి అందులో బాలకృష్ణుడి ప్రతిమను వుంచి పాటలు పాడతారు. ధూప .. దీప.. నైవేద్యాలతో స్వామివారిని పూజించి ఇరుగు పొరుగు వారికి తీర్థ ప్రసాదాలు పంచుతారు. ఇక ఆరోజు సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమంలో యువకులంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. ఉట్టి కొట్టడం వలన లభించే కొత్త కుండ పెంకులు ఇంట్లో భద్రపరిచినట్టయితే, పాడిపంటలు వృద్ధి చెందుతాయని భావిస్తారు.

ఆ రాత్రి కృష్ణ మందిరాలకు వెళ్లి ఆయన లీలా విన్యాసాలను గురించి చెప్పుకోవడమో ... పారాయణ చేయడమో చేస్తారు. శ్రీ కృష్ణుడి బాల్య చేష్టలు ... ఆయన బృందావన విశేషాలు ప్రస్తావించబడిన భజనలను చేస్తూ ఆ తన్మయత్వంలో ఆబాలగోపాలం తరించిపోతారు.

More Bhakti Articles