శబరిమల ప్రవేశం

శబరిమల ప్రవేశం
హరిహరుల కుమారుడిగా ఆవిర్భవించిన అయ్యప్పస్వామిని లక్షలాదిమంది భక్తులు ఆరాధిస్తూ వుంటారు. అయ్యప్ప సర్వాంతర్యామి అయినప్పటికీ ఆయన పాదస్పర్శచే మరింత పవిత్రమైన ఆ ప్రదేశాన్ని స్పర్శించి ధన్యతను పొందాలనే ఉద్దేశంతో కొండకోనలను దాటుకుంటూ దీక్షాధారులు 'శబరిమల' చేరుకుంటారు.

శ్రీరాముడి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఆయన భక్తురాలు శబరి నివసించిన కొండ కనుక దీనికి శబరిమల అనే పేరు వచ్చిందని అంటూ వుంటారు. 'శబరులు' అనే కొండ జాతివారు ఈ కొండ ప్రదేశంలో నివసించడం వల్లనే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందనే అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తుంటారు. అడవి మృగాల బారి నుంచి తమని కాపాడే దైవంగా వారే ముందుగా స్వామిని అర్చించారని స్థలపురాణం చెబుతోంది.

ఎటు చూసినా కొండలు ... ముళ్లతోను ... రాళ్లతోనూ కూడిన కాలిబాటలు, నియమనిష్టలతో కూడిన భక్తికి ... ఆ భక్తితో సాధించిన శక్తికి పరీక్ష పెడుతుంటాయి. ఇక్కడి విశిష్టతను బట్టి ఆలయాన్ని కొన్ని సమయాల్లో మాత్రమే తెరుస్తూ వుంటారు. మండల దీక్ష తీసుకుని ఇరుముడితో వచ్చే భక్తుల కోసం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకూ ఆలయాన్ని తెరచి ఉంచుతారు.

ఆ తరువాత నిర్వహించే 'మకరవిళక్కు' అనే ఉత్సవం సందర్భంగా జనవరి 1 నుంచి 14 వరకూ భక్తులకు ప్రవేశం కల్పిస్తారు. ఇక ఏప్రిల్ మాసంలో రాత్రి - పగలు సమానంగా వుండే రోజు (విశువత్తు)న ఆలయాన్ని తెరచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కులమతవర్గ భేదాలు లేకుండా స్వామి దీక్షను స్వీకరించిన ప్రతి పురుషుడు ఆయనని దర్శించుకోవచ్చు.

ఇక రజస్వల కాని బాలికలకు ... బహిష్టులు వుడిగిన మహిళలకు మాత్రమే ప్రవేశార్హత వుంటుంది. నియమ నిష్టలతో స్వామి దీక్షను కొనసాగించిన వారికి ఆయన దర్శనభాగ్యం త్వరగా లభిస్తుందని అంటూ వుంటారు. నిస్సహాయ స్థితికి చేరుకున్న భక్తులను ఆయనే కొండదిగి వచ్చి పైకి చేర్చిన సంఘటనలను గురించి చెప్పుకుంటూ వుంటారు.

More Bhakti Articles