కరుణించే గోదారంగనాథులు

కరుణించే గోదారంగనాథులు
ధనుర్మాసం దగ్గర పడుతూ ఉండగానే చలికూడా పెరుగుతూ వుంటుంది. చలిలో తెల్లవారు జామునే నిద్రలేచి, చన్నీటి స్నానం చేసి గోదా సమేత రంగనాథస్వామిని దర్శించి ధద్యోదనం ప్రసాదంగా స్వీకరించడం వలన అనంతమైన పుణ్యంతో పాటుగా అనిర్వచనీయమైన అనుభూతి కూడా కలుగుతూ వుంటుంది. అందువలన ధనుర్మాసం సమీపిస్తూ ఉండగానే భక్తులు గోదా సమేత రంగనాథ స్వామిని దర్శించుకుని తరిస్తూ వుంటారు.

వైష్ణవ సంబంధమైన చాలా ఆలయాల్లో ధనుర్మాస ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. అలా ధనుర్మాసంలో భక్తుల సందడి ఎక్కువగా కనిపించే ఆలయం మనకి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కనిపిస్తుంది. ఇక్కడికి చేరుకోగానే సువిశాలమైన ప్రదేశంలో నెలకొని వున్న ఆలయాల సముదాయం కనిపిస్తుంది. గోదాదేవి ... వేంకటేశ్వరస్వామితో పాటు ఈ ప్రాంగణంలో కన్యకాపరమేశ్వరి ... శ్రీ కృష్ణుడు ... హనుమంతుడు పూజలందుకుంటూ వుంటారు.

ఆలయాన్ని తీర్చిదిద్దిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. పవిత్రత ... ప్రశాంతత ఈ ఆలయానికి సహజమైన ఆభరణాలుగా అనిపిస్తూ వుంటాయి. ఆలయంలో దర్శనమిచ్చే అన్ని మూల మూర్తుల్లోను జీవకళ ఉట్టిపడుతూ వుంటుంది. సౌందర్యాత్మకంగా విగ్రహాలను మలచినతీరు హృదయాలను హత్తుకుపోతుంది ... మనసంతా భక్తిభావ పరిమళాలను వ్యాపింపజేస్తుంది. ప్రతి దైవం ఆయా పుణ్య తిథుల్లో విశేష పూజలను అందుకుంటూ వుంటుంది.

శక్తిస్వరూపిణి అయిన కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఆశ్వీయుజ మాసంలోను ... కార్తీక మాసంలోను విశేష పూజలను అందుకుంటుంది. ఇక ధనుర్మాసంలో వేంకటేశ్వరస్వామి - గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. 'భోగి' పండుగ రోజున ఈ అందాల జంటకు ఘనంగా జరిగే కళ్యాణ మహోత్సవాన్ని చూసితీరవలసిందే. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటూ వుంటారు ... శక్తిమేరా కానుకలు సమర్పించుకుంటూ, భక్తిమేర వరాలను పొందుతూ వుంటారు.

More Bhakti Articles