మహిమగల మహాలక్ష్మి

మహిమగల మహాలక్ష్మి
కష్టాలు ... ఆపదలు అప్పుడప్పుడు అందరికీ ఎదురౌతూనే వుంటాయి. ఎక్కువ సందర్భాల్లో ఈ రెండింటి నుంచి ఆర్ధిక పరమైన కారణాలే గట్టెక్కిస్తూ వుంటాయి. నిత్యావసరాలు ... అత్యవసరాలు ... ఆపదల నుంచి బయటపడాలంటే డబ్బు కావాలి. అప్పుడే ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం జరుగుతూ వుంటుంది. ఆర్ధికపరమైన ఆసరానే మనిషిని ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది.

అలాంటి ఆర్ధిక పరిస్థితి బలంగా ఉండటంలో లక్ష్మీదేవి అనుగ్రహం ప్రధానమైన పాత్రను పోషిస్తూ వుంటుంది. ఈ కారణంగానే ఒక్క శుక్రవారమనే కాకుండా ప్రతిరోజు లక్ష్మీదేవిని భక్తులు పూజిస్తుంటారు ... ఆ తల్లి అనుగ్రహం కోసం అనునిత్యం ఆరాధిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అనేక ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాలు నెలకొన్నాయి. అలాంటి విశిష్టమైన ఆలయాల్లో ఒకటి, సికింద్రాబాద్ - వెస్ట్ మారేడుపల్లిలో దర్శనమిస్తుంది.

ఇక్కడి మహాలక్ష్మీ ఆలయం దర్శించి తీరవలసిందే. విశాలమైన ప్రదేశంలో అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయంలో అమ్మవారు నేత్రపర్వంగా దర్శనమిస్తుంది. తామరపూలతో పూజలందుకోవడం అమ్మవారికి ఇష్టం కనుక, ఆ విధంగానే అమ్మవారిని సంతోషపెడుతూ వుంటారు. విశేష సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తుంటారు.

ఇక పండుగ రోజుల్లో అమ్మవారి వైభవం కళ్లారా చూడవలసిందే. ప్రత్యేక పూజలు ... అందమైన అలంకరణలు ... విశేష సేవలు భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. మనసున్న మహాలక్ష్మీ మహిమగలదనీ, దర్శన మాత్రం చేతనే దారిద్ర్యాన్ని నశింపజేసి సంపదలను అనుగ్రహిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతూ వుంటారు.

More Bhakti Articles