శివ గంగ మహిమ

శివ గంగ మహిమ
జమదగ్ని మహర్షి శాపం కారణంగా రేణుకాదేవి కుష్ఠు వ్యాధిగ్రస్తురాలవుతుంది. మహర్షి శాపం వలన ఆమెను చేరదీయడానికి ఎవరూ సాహసించరు. దాంతో ఆమె తీవ్రమైన ఆవేదన చెందుతూ అడవిలో ఒంటరిగా తిరుగుతూ వుంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి లోకనాథుడు అనే మునీశ్వరుడు తారసపడతాడు. తన పరిస్థితిని ఆయనకి వివరించి, తనకి శాప విమోచనం కలిగించమని కోరుతుంది.

శపించినది జమదగ్ని మహర్షి కావడం వలన, ఆ శాపం నుంచి బయటపడేసే శక్తి ఒక్క పరమ శివుడికి తప్ప మరెవరికీ లేదని చెబుతాడు లోకనాథుడు. అక్కడికి సమీపంలోని కొండపై శివుడు కొలువై ఉన్నాడనీ, ఆయనని పూజించమని చెప్పి వెళ్లిపోతాడు. ఆ మునీశ్వరుడి మాటలు జీవితం పై ఆమెకి కొత్త ఆశలు చిగురింపజేస్తాయి. మహేశ్వరుడి దర్శనం వలన తన శాపం తొలగిపోతుందనే విశ్వాసంతో అతి కష్టం మీద ఆ కొండపైకిచేరుకుంటుంది.

అక్కడ ధ్యానముద్రలో కొలువైన శివుడి ప్రతిమను చూడగానే రేణుకాదేవి కన్నీళ్ల పర్యంతమవుతుంది. తన భర్త పట్ల తనకి నిజమైన ప్రేమానురాగాలే వుంటే, తలపైనున్న గంగను కురిపించి తన వ్యాధిని నివారించమని ప్రార్ధిస్తుంది. తన ఆరాధనలో ఎలాంటి లోపమూ లేకుంటే తనకి పూర్వ రూపాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతుంది. ఆమె రోదనకు మహాశివుడి మనసు కరిగిపోతుంది.

ఆయన తలపై నున్న గంగ నుంచి ధారాపాతంగా నీరు రేణుకా దేవి శిరస్సు నుంచి పాదాల వరకూ కురుస్తుంది. శివుడి అనుగ్రహంతో ... గంగాదేవి స్పర్శతో రేణుకాదేవి వ్యాధి మటుమాయమైపోతుంది. ఆనందంతో ఆమె పరమశివుడి పాదాలపై పడుతుంది. అనేక కష్టాల నుంచి తనని గట్టెక్కించిన సదాశివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది. తనకి మరో జన్మను ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడి నుంచి బయలుదేరుతుంది.

More Bhakti Articles