సంతోషాలనిచ్చే సాయి క్షేత్రం

సంతోషాలనిచ్చే సాయి క్షేత్రం
మహారాష్ట్రలో మారుమూల గ్రామమైన శిరిడీని పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మార్చిన సాయిబాబా, భక్తుల హృదయాల్లో సద్గురువుగా ... సత్యం గల దేవుడిగా శాశ్వితమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ కారణంగానే ఆయనని ప్రతిరోజు దర్శించుకోవాలనీ ... పూజించుకోవాలని అనుకున్న భక్తులు, తమ గ్రామాల్లో ఆయనకి ఆలయాలు నిర్మించారు. అభిషేకాలతో ... హారతులతో ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు.

అలాంటి విశిష్టమైన సాయిబాబా ఆలయాలలో హైదరాబాద్ - హస్తినాపురంలో గల ఆలయం ఒకటిగా దర్శనమిస్తుంది. సరూర్ నగర్ మండల పరిధిలోగల ఈ ఆలయం, ప్రతి గురువారం అత్యధిక సంఖ్యలో వచ్చే భక్తులతో రద్దీగా కనిపిస్తూ వుంటుంది. ఆలయంలోకి అడుగుపెట్టిన భక్తులు ముందుగా 'ధుని'కి ప్రదక్షిణలు చేసి, వేపచెట్టు నీడలోగల గురుస్థానాన్ని దర్శించుకుంటారు. ఆ తరువాతే ప్రధాన మంటపంలోకి ప్రవేశిస్తారు.

ఇక్కడి వేదికపై చిరుమందహాసం చేస్తూ సాయి మనోహరంగా దర్శనమిస్తూ వుంటాడు. అల్లకల్లోలమైన మనసుతో ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన వాళ్లు, సాయిని దర్శించగానే ప్రశాంతతను ... ఉపశమనాన్ని పొందుతారు. శిరిడీలో మాదిరిగానే ఇక్కడి సాయికి అభిషేకాలు ... హారతులు జరుగుతుంటాయి. ఇక ప్రతి గురువారం పల్లకీసేవ ... పవళింపు సేవను ఘనంగా నిర్వహిస్తారు.

పల్లకీ మోసిన విద్యార్ధినీ విద్యార్ధులు అత్యున్నతమైన స్థాయిలో ఉత్తీర్ణతను సాధిస్తూ ... విదేశాల్లో సైతం ఉద్యోగాలను పొందుతూ వస్తున్నారు. అందువలన ఇక్కడి పల్లకీసేవలో యువతీ యువకులే ఎక్కువగా కనిపిస్తూ వుంటారు. ఇక బాబా పల్లకీని ఊరేగించడానికి అనుకూలంగా, ఆలయం విశాలమైన నాలుగు మాడ వీధులను కలిగివుండటాన్ని విశేషంగా చెప్పుకోవాలి.

ఇదే ప్రాంగణంలో రామాలయం ... ఆ పక్కనే గణపతి మందిరం ... నవగ్రహాలు కనిపిస్తాయి. పవిత్రతకు ... విశిష్టతకు ప్రతీకగా కనిపించే ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ... గురుపౌర్ణమి ఉత్సవాలు ... ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి.

More Bhakti Articles