నాగపూజా మహిమ

నాగపూజా మహిమ
'మాసానాం మార్గశీర్షోహం' అని సాక్షాత్తు కృష్ణ భగవానుడు సెలవిచ్చాడు. అంతటి పవిత్రమైన ఈ మాసంలో 'పంచమి'రోజున నాగదేవతను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని పార్వతీదేవితో పరమశివుడు చెప్పినట్టుగా పురాణాలు ప్రస్తావిస్తున్నాయి. ప్రాచీనకాలం నుంచి నాగు పాముని దేవతగా భావించి పూజించడం జరుగుతోంది.

నాగదేవతను ఆరాధించడం వలన పంటలు బాగా పండుతాయనీ ... సంతానం కలుగుతుందనీ ... సౌభాగ్యం నిలుస్తుందనీ ... సర్ప దోషాలు తొలగిపోతాయనే బలమైన విశ్వాసం అనాదిగా వుంది. ఈ కారణంగానే వివిధ ప్రదేశాల్లో కొలువైన నాగదేవతను అంతా భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ వుంటారు.

ఈ రోజున ఉదయాన్నే స్త్రీలు అభ్యంగన స్నానం చేసి నాగులపుట్ట దగ్గరికి వెళతారు. భక్తితో అక్కడ దీపారాధనను వుంచి పుట్టకు నమస్కరిస్తారు. పూలతోను ... పసుపు కుంకుమలతోను పూజిస్తారు. పత్తితో చేసిన వస్త్రాలను ... యజ్ఞోపవీతమును నాగదేవతకు సమర్పిస్తారు. పుట్టలో పాలుపోసి ప్రదక్షిణలు చేస్తూ తమ కుటుంబాన్ని చల్లగా చూడమని ప్రార్ధిస్తారు. ఇక నాగదేవత ప్రతిమ రూపంలో ఉన్నట్టయితే, పూలమాలలను సమర్పిస్తారు. పూజానంతరం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రదక్షిణలు చేస్తారు.

ఈ రోజున నాగదేవతను పూజించడం వలన సర్పాధిదేవత అయిన 'మానసాదేవి' అనుగ్రహం లభిస్తుందనీ, ఫలితంగా విష బాధలు దరిచేరవని అంటారు. పాములకు ... వాటి పిల్లలకు హాని కలిగించ కూడదనే ఉద్దేశంతో ఈ రోజున భూమిని దున్నకుండా ... పుట్టలు దెబ్బ తినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు.

More Bhakti Articles