శివభక్తి పరీక్ష

అత్రి మహర్షి ఎప్పటిలా శివ దర్శనానికి ఆలయానికి రాకపోవడం శివానందుడనే పూజారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గురించి ఆయన ఆలయానికి వచ్చిన ఇతర భక్తుల దగ్గర ప్రస్తావిస్తాడు. అత్రి మహర్షి ఆశ్రమంలోనే శివలింగాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ శివలింగ పూజలోనే ఆయన మునిగితేలుతున్నాడని తెలుసుకుంటాడు. ఆయన పూజలు అందుకుంటోన్న ఆ శివలింగం అత్యంత మహిమాన్వితమైనదనీ, దానిని ఆదిదంపతులే ఆయనకి స్వయంగా అందజేసినట్టు వింటాడు.

నిజానిజాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళతాడు. ఆశ్రమంలో వేదికపై గల శివలింగాన్ని చూసి, దాని గురించి అడుగుతాడు. తన భక్తికి మెచ్చి సాక్షాత్తు పరమశివుడే దానిని అనుగ్రహించాడని చెబుతాడు అత్రిమహర్షి. ఆ మాటలను శివానందుడు కొట్టిపారేస్తాడు. తాను కొన్ని సంవత్సరాలుగా శివుడిని అనునిత్యం పూజిస్తున్నాననీ, అలాంటి తననే శివుడు ఏనాడూ అనుగ్రహించలేదంటూ అహంభావాన్ని ప్రదర్శిస్తాడు.

మానసికంగా మహాదేవుడికి దగ్గరైనప్పుడే ఆయన అనుగ్రహిస్తాడని చెబుతాడు అత్రి మహర్షి. తనది అసలైన భక్తి కాదన్నందుకు శివానందుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఇదంతా గమనిస్తోన్న అనసూయాదేవి,అత్రి మహర్షితో పాటు శివానందుడికి కొన్ని పూలను అందిస్తుంది. నిజమైన భక్తి గల వారి పువ్వులను మాత్రమే సదాశివుడు స్వీకరిస్తాడని అంటుంది. ఆమె పెట్టిన శివభక్తి పరీక్షకు శివానందుడు అంగీకరిస్తాడు .

దాంతో అత్రి మహర్షి తన దోసిలి లోను పువ్వులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శివలింగం చెంత సమర్పిస్తాడు. శివానందుడు కూడా తన దోసిలిలోని పువ్వులను సమర్పించబోగా, హఠాత్తుగా వచ్చిన గాలికి అవి కొట్టుకునిపోతాయి. జరుగుతున్నదంతా ప్రత్యక్షంగా చూస్తోన్న ఆశ్రమవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అత్రిమహర్షి శివ భక్తిని అంగీకరించలేక అవమానభారంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు శివానందుడు.


More Bhakti News