దోషాలను తొలగించే క్షేత్రం

దోషాలను తొలగించే క్షేత్రం
తమిళనాడు ప్రాంతంలోనే కాకుండా కర్ణాటక ప్రాంతంలోనూ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో విశిష్టతను సంతరించుకున్న క్షేత్రంగా బెంగుళూరు - బసవేశ్వరనగర్ కి చెందిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం దర్శనమిస్తుంది.

శివపార్వతుల కుమారుడిగానే కాకుండా, అత్యంత పరాక్రమవంతుడిగా సుబ్రహ్మణ్యస్వామి ప్రసిద్ధికెక్కాడు. లోక కల్యాణం కోసం దేవతల కోరికమేరకు అసురుల సంహారంలో కీలకమైన పాత్రను పోషించాడు. ఈ నేపథ్యంలో 'పంచారామాలు' వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఆవిర్భవించడానికి కారకుడయ్యాడు.

అలాంటి సుబ్రహ్మణ్యస్వామి అశేషమైన సంఖ్యలో భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన అనేక ప్రాంతాల్లో కొలువై కొంగుబంగారంగా అలరారుతున్నాడు. బసవేశ్వరనగర్ కి చెందిన క్షేత్రం కూడా ఈ నేపథ్యంలోనిదే. చాలాకాలం క్రిందటే భారీ నిర్మాణంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయం, భక్తుల మనోఫలకంపై నిలిచిపోయేదిలా వుంటుంది. గర్భాలయంలో నెమలి వాహనంతో సహా స్వామి దర్శనమిస్తూ వుంటాడు.

ఇక్కడి స్వామిని పూజించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి, సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెబుతారు. అందుకు నిదర్శనంగా నిలిచినవారిని కూడా ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. 'సుబ్రహ్మణ్య షష్ఠి' పర్వదినాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జరిపే ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ... స్వామి అనుగ్రహాన్ని సంతోషంతో పొందుతుంటారు.

More Bhakti Articles