తప్పు తెలుసుకున్న భార్య

తప్పు తెలుసుకున్న భార్య
కబీరు నిరంతరం శ్రీరాముడి ధ్యానంలోనే కాలం గడపసాగాడు. అయితే ప్రతినిత్యం తన ఇంటికి వచ్చే సాధువులకు భోజన వసతి కలిగించడం ఆయనకి కష్టమైపోసాగింది. దాంతో ఆయన అందుకు అవసరమైనంతవరకే వస్త్రాలను నేసి అమ్ముకుని వస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి 'లోయీ' అనే యువతితో వివాహం జరుగుతుంది.

తన పద్ధతులు ... పరిస్థితుల గురించి ముందుగానే చెప్పి ఆయన ఆ యువతిని వివాహం చేసుకుంటాడు. ఆమె ఆయన మనసెరిగి నడచుకుంటూ వుండేది. కాలక్రమంలో పిల్లలు కలగడంతో కుటుంబం గడవడం కష్టమైపోతుంది. అయినా కబీర్ దానధర్మాలు మానుకోకపోవడంతో, లోయీ తీవ్రమైన అసహనానికి లోనవుతుంది. అతిథులు కారణంగా ఒక్కోసారి పిల్లలను కూడా పస్తులు వుంచవలసి రావడాన్ని ఆమె భరించలేకపోతుంది.

ఇక కుటుంబాన్ని నడపడం తన వల్లకాదంటూ పిల్లలను తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. అయితే కబీరు మాత్రం ఆవేశపడకుండా ఆమె అమాయకత్వానికి నవ్వుకుంటాడు. ఇల్లువదిలి వెళ్ళిన భార్యా పిల్లల గురించి కాకుండా, ఆ రోజు అతిథులుగా రానున్న వాళ్లకి చేయవలసిన ఏర్పాట్ల గురించే ఆయన ఆలోచిస్తాడు. సమస్త జీవులకు ఆహారాన్ని సమకూర్చే ఆ భగవంతుడే, తన ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్లు ఆకలితో వెనుదిరగకుండా చూసుకుంటాడని భావిస్తాడు.

ఇల్లు వదిలి వెళ్లిన లోయీ, పిల్లలను పోషించుకోలేక అనే అవమానాలను ... ఇబ్బందులను ఎదుర్కుంటుంది. దేవుడిలాంటి భర్తను దూషించి వచ్చినందుకే తనకి ఇలా జరుగుతోందని ఆమె గ్రహిస్తుంది. పిల్లలతో పాటు తిరిగి వచ్చి మన్నించమంటూ కబీర్ పాదాలపై పడుతుంది. తల్లి మనసు ఎలాంటిదో తనకి తెలుసనీ, భగవంతుడి తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమంటూ ఆమెకి హితవు చెబుతాడు కబీరు.

More Bhakti Articles