పూజలో సందేహాలు

పూజలో సందేహాలు
పూజ ఏదైనా అది దైవానుగ్రహం కోసమే చేయడం జరుగుతుంటుంది. అలాంటి పూజలో తెలిసి గాని తెలియక గాని ఏదైనా పొరపాటు జరుగుతుందేమోననే ఆందోళన ఒకవైపు ఉండనే వుంటుంది. తాము చేస్తున్న పూజ పట్ల వుండే ఒకరకమైన సందేహమే ఇందుకు కారణమవుతూ వుంటుంది. వివాహిత స్త్రీలు ఆచరించే 'సువాసిని పూజ' విషయంలోనూ కొంతమందికి సందేహాలు లేకపోలేదు.

సాధారణంగా దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారు ధరించే వివిధ రూపాలకు అనుగుణంగా ఈ సువాసినీ పూజ చేస్తుంటారు. బాల ... కుమారి ... సువాసిని ... దంపతి పూజలు ఈ సందర్భంలోనే జరుగుతుంటాయి. ఒకప్పుడు ఈ సువాసినీ పూజలను ఇంటి దగ్గరే జరిపినప్పటికీ, ఇటీవల కాలంలో దేవాలయాల్లోనే నిర్వహించడం జరుగుతోంది. సువాసినీ పూజలో ముత్తయిదువులను అమ్మవారిగా భావించి అలంకరించడం ... పూజించడం జరుగుతూ వుంటుంది.

పూజ పూర్తయిన తరువాత వారికి దక్షిణ తాంబూలం ఇస్తుంటారు. ఇక తాంబూలంతో పాటుగా కొందరు పసుపు ... కుంకుమ ... అద్దం ... దువ్వెన ... ఇస్తుంటారు. మరి కొందరు వీటికి వస్త్రం - వక్కలు జోడిస్తుంటారు. దాంతో అసలు సువాసినికి తాంబూలంతో పాటుగా ఏం ఇవ్వాలనే విషయంలో కొంతమంది అయోమయానికి లోనవుతుంటారు. శాస్త్రం మాత్రం సువాసినికి తొమ్మిది వస్తువులను తప్పనిసరిగా సమర్పించాలని చెబుతోంది.

దక్షిణ తాంబూలం .. పసుపు .. కుంకుమ .. గంధం .. అద్దం .. దువ్వెన .. కాటుక .. గాజులు .. వస్త్రం ఈ జాబితాలో వుండాలని శాస్త్రం తెలుపుతోంది. ఈ తొమ్మిది వస్తువులను ముందుగానే ఏర్పాటుచేసుకుని ఒకేసారి అందించాలి. దేనిని మరిచిపోకూడదు ... పొరపాటున కూడా వెనక్కి తీసుకోకూడదు అనే నియమం వుంది. ఇక ఈ తొమ్మిది వస్తువులు వున్న తరువాత సువాసినీ పూజ చేసిన వాళ్లు తమ స్తోమతిని బట్టి అమ్మవారికి ఇష్టమైనవి ఏవైనావుంటే అవి ఇవ్వడంలో ఎలాంటి దోషం లేదని స్పష్టం చేస్తోంది.

More Bhakti Articles