లక్ష్మీనారాయణుల క్షేత్రం

లక్ష్మీనారాయణుల క్షేత్రం
సాధారణంగా మనకి లక్ష్మీనారసింహ క్షేత్రాలు ... లక్ష్మీదేవి సమేతంగా కొలువైన వేంకటేశ్వర స్వామి క్షేత్రాలు ... లక్ష్మీ సమేతంగా అలరారే రంగనాథస్వామి క్షేత్రాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక లక్ష్మీనారాయణులు ఈ జగత్తుకు తల్లిదండ్రులే అయినప్పటికీ, ఈ పేరుతో వారు ఆవిర్భవించిన క్షేత్రాలు అరుదుగానే కనిపిస్తూ వుంటాయి. అలాంటి అరుదైన క్షేత్రం కరీంనగర్ జిల్లా 'మంథని'లో దర్శనమిస్తుంది.

మంథనిలో మనకి అనేక దేవాలయాలు కొలువుదీరి కనిపిస్తూ వుంటాయి. ఈ కారణంగా ఈ ఊళ్లోకి అడుగుపెడితే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రంలో, లక్ష్మీనారాయణులు భక్తులను అనుగ్రహిస్తూ వుంటారు. ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం, అలనాటి శిల్పకళా రీతులను అద్భుతంగా ఆవిష్కరిస్తూ వుంటుంది.

ఇక్కడ లక్ష్మీనారాయణులు ఒక ఆలయంలోను ... లక్ష్మీదేవి మాత్రమే కొలువుదీరిన మరో ఆలయం దర్శనమిస్తూ వుంటాయి. ఇందుకు కారణమైన కథ ఒకటి మనకి స్థల చరిత్రగా వినిపిస్తూ వుంటుంది. లక్ష్మీదేవిని పూజించడం వలన సౌభాగ్యంతో కూడిన సంపదలు అనుగ్రహిస్తుందనీ, నారాయణుడిని ఆరాధించడం వలన విజయంతో కూడిన సంపదలు అనుగ్రహిస్తాడని చెబుతుంటారు. అలాంటిది ఆ ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువై వున్నారంటే ఇక భక్తులకు అంతకు మించిన అదృష్టం ఏముంటుంది?

ఆ భాగ్యం ఈ ప్రాంత ప్రజలకు అడగకుండానే లభించిన వరంగా చెప్పుకోవచ్చు. విశేషమైన పుణ్య తిథుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అశేషంగా వుంటుంది. తమ కష్టాలను ఇష్టంగా తీర్చే ఈ కొండంత దేవుడిని భక్తులు అనునిత్యం ఆరాధిస్తుంటారు ... అనంతమైన ఆనందానుభూతులను పొందుతుంటారు.

More Bhakti Articles