శాపవిమోచనం

శాపవిమోచనం
పూర్వం ఓ గ్రామంలో విష్ణుదత్తుడు - సోమదేవమ్మ అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవాళ్లు. ఆ దంపతులు నీతిబద్ధమైన ... నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ అనునిత్యం శ్రీ దత్తాత్రేయస్వామిని ఆరాధిస్తూ ఉండేవాళ్లు. ఆ ఇంటి ప్రాంగణంలోని ఓ చెట్టుపై కాకి రూపంలో ఓ బ్రహ్మరాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ దంపతుల పవిత్రమైన జీవన విధానాన్ని చాలా దగ్గరగా చూసే అవకాశం ఆ రాక్షసుడికి కలిగింది.

మూగజీవాల కోసం వారు ప్రతిరోజు ఏర్పాటు చేస్తోన్న ఆహారాన్ని కాకి రూపంలోనే ఆ రాక్షసుడు స్వీకరించసాగాడు. అందుకు కృతజ్ఞతగా ఆ దంపతులకు దత్తాత్రేయ స్వామిని చూపించాలని నిర్ణయించుకుంటాడు. ఓ రోజున ఆ దంపతుల ఎదుట ప్రత్యక్షమై, తన గురించి చెప్పుకుని ఆవేదన చెందుతాడు. వారి ఇష్టదైవమైన దత్తాత్రేయుడు అనేక రూపాల్లో తిరుగుతూ ఉంటాడనీ, ఆయనని వారికి చూపిస్తానంటూ మాట ఇస్తాడు.

మారువేషంలో వున్న దత్తాత్రేయుడిని ఆ రాక్షసుడి సాయంతో కలుసుకుని తన ఇంటికి భోక్తగా రావలసిందిగా విష్ణుదత్తుడు కోరతాడు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో దత్తాత్రేయుడు వారి ఇంటికి భోక్తగా వస్తాడు. పితృ కార్యం పూర్తయ్యాక ఏం వరం కావాలో కోరుకొమ్మని విష్ణుదత్తుడిని కోరతాడు దత్తాత్రేయుడు. ఆయన దర్శన భాగ్యం తమకి లభించేలా చేసిన బ్రహ్మ రాక్షసుడికి శాపవిమోచనం కలిగించమని ఆ దంపతులు కోరతారు.

అందుకు స్వామి ఆనందంగా అంగీకరిస్తాడు. తమ కోసం ఎలాంటి వరం కోరుకొని ఆ దంపతుల మంచితనాన్ని అభినందిస్తాడు. ఎంతోమంది అజ్ఞానం వారి వలన తొలగించబడుతుందనీ, ఇకపై తాను సూచించిన మార్గంలో ప్రయాణించమని చెబుతాడు. ఆధ్యాత్మిక పథంలో ప్రజలను నడిపించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను ఆ దంపతులకు అనుగ్రహిస్తాడు.

More Bhakti Articles