శ్రీవారి సేవలో తరించిన మహారాజులు

శ్రీవారి సేవలో తరించిన మహారాజులు
రాజులైనా ... మహారాజులైనా ... చక్రవర్తులైనా ఆ పరమాత్ముడి దృష్టిలో మామూలు మనుషులే. వాళ్లంతా ఆయన పాదపద్మాల దర్శనాన్ని ఆశించినవారే ... అనునిత్యం ఆయన సేవను ఆకాంక్షించిన వారే. ప్రాచీనకాలానికి చెందిన ఆలయాల నిర్మాణాలను ... అక్కడి శాసనాలను పరిశీలిస్తే నాటి రాజులకు గల దైవభక్తి గురించి తెలుస్తుంది.

రాజ్యం సుభీక్షంగా ఉండటానికీ, యుద్ధంలో విజయాలు సాధించడానికి దైవబలమే కారణమని వాళ్లంతా ఎంతగానో విశ్వసించారు. తాము సంపాదించిన సంపదలో కొంతభాగాన్ని దైవ కార్యాలకు ఉపయోగించారు. అలా తిరుమల శ్రీవారిని సేవించి తరించిన రాజులలో శ్రీకృష్ణదేవరాయలు ముందువరుసలో కనిపిస్తాడు.

తన పరిపాలనా కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో ఆలయాలను నిర్మించాడు ... మరెన్నో ఆలయాల అభివృద్ధికి కృషిచేశాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించి ఆయా దైవాలకు తనదైన స్థాయిలో భారీగా కానుకలు సమర్పించాడు. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు తన దేవేరులతో కలిసి తిరుమల వచ్చినప్పుడల్లా స్వామివారి సేవలకు ... అలంకరణలకు ఉపయోగించే అనేక వస్తువులను ... ఆభరణాలను సమర్పించాడు.

ఈ జాబితాలో ముత్యాలు .. రత్నాలు ... నీలాలు ... పచ్చలు ... మాణిక్యాలు పొదగబడిన ఆభరణాలు కనిపిస్తాయి. వీటిలో ముఖ్యంగా మూలమూర్తికి అలంకరించే రత్నాల కిరీటం ... రత్నాల కంఠాభరణాలు ... మలయప్ప స్వామికి అలంకరించే గుండ్రని కిరీటం ... ఉత్సవ మూర్తులకు అలంకరించే 'పెద్ద పచ్చ' గల హారం కృష్ణదేవరాయలు సమర్పించినవే. ఇక కర్పూరహారతి సేవకు గాను 25 వెండి పళ్ళాలు ... ఏకాంత సేవలో ఉపయోగించడం కోసం రెండు బంగారు గిన్నెలను కూడా ఆయన సమర్పించారు.

అంతటి ఖరీదైన కానుకలను సమర్పించడం తన గొప్పగా రాయల వారు ఎప్పుడూ భావించలేదు. భగవంతుడు తనకి కల్పించినది తిరిగి ఆయన సేవకే వినియోగించాను అనే భావనే ఆ సేవలోని ఉద్దేశంగా అనిపిస్తుంది ... పరమార్థంగా కనిపిస్తుంది. అందుకు నిదర్శనంగానే రాయల వారి విగ్రహం, ఆయన ఉభయ దేవేరుల విగ్రహాలు ఆలయ మంటపంలో సభక్తికంగా కొలువుదీరి నేటికీ దర్శనమిస్తుంటాయి.

More Bhakti Articles