శంకరుడి మహిమ

శంకరుడి మహిమ
శంకరులవారు సన్యాసం స్వీకరించడానికి సమయం ఆసన్నమవుతుంది. సన్యాసం స్వీకరించాలంటే తల్లి అనుమతి తప్పనిసరిగా తీసుకోవలసి వుంటుంది. దాంతో శంకరుల వారు, తన నిర్ణయాన్ని తల్లికి తెలియజేస్తాడు. ఆ మాటకి తల్లి నిస్సహాయతతో నివ్వెరపోతుంది. వయసు పైబడుతోన్న తనకి అతని ఆసరా ఎంతో అవసరమనే సంగతిని గుర్తు చేస్తుంది. వివాహం చేసుకుని వంశాన్ని ఉద్ధరించవలసిన బాధ్యత అతనిపై ఉందనీ, అతను సన్యాసం స్వీకరించడానికి తాను అంగీకరించనని తేల్చి చెప్పేస్తుంది.

దాంతో శంకరులవారు ఆలోచనలో పడతాడు. తల్లిని ఎలా ఒప్పించాలో తెలియక ఆయన సతమతమైపోతాడు. కారణజన్ముడే అయినప్పటికీ మరింత వత్తిడి చేసి కన్నతల్లి మనసుకి కష్టం కలిగించలేక, నిర్ణయాన్ని ఆ నీలకంఠస్వామికే వదిలేస్తాడు. ఆ తరువాత ఆయన ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి ఆయన కాలును బలంగా కరిచి పట్టుకుని లోపలికి లాగుతుంటుంది. తీరంలో గల తల్లిని చూస్తూ శంకరులవారు గట్టిగా కేకలు వేస్తాడు.

పరిస్థితిని గ్రహించిన తల్లి పరుగున అక్కడికి వస్తుంది. శంకరుల వారిని కాపాడటానికి ఆమె చేస్తోన్న ప్రయత్నాలు విఫలం కాసాగాయి. ఇక లాభం లేదనీ ... ఆ మొసలి తన ప్రాణాలు తీయడం ఖాయమని శంకరులు బాధగా తల్లితో అంటాడు. తాను సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమనీ, తనకి ఆత్మ సంతృప్తిగా ఉంటుందని చెబుతాడు. కన్నీళ్ల పర్యంతమైన ఆర్యాంబ, అతను సన్యాసం తీసుకోవడానికి తాను అంగీకరిస్తున్నట్టుగా చెబుతుంది.

అంతే ఆ మాట వినగానే శంకరులవారి కాలుని వదిలి మొసలి వెళ్లిపోతుంది. ఈ దృశ్యాన్ని చూసిన ఆర్యాంబ ఆశ్చర్యపోతుంది ... అది మహాదేవుడి మహిమగా అర్థం చేసుకుంటుంది. తీరానికి చేరుకున్న శంకరులు తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తాడు. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించిన తల్లికి ... అందుకు అవసరమైన పరిస్థితిని కల్పించిన పరమేశ్వరుడికి శంకరుల వారు కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు.

More Bhakti Articles