పూజలో పరమార్ధం

పూజలో పరమార్ధం

పూజలో పరమార్ధం
దేవుడిని పూజించడంలో ఆనందం వుంటుంది ... అనుభూతి వుంటుంది. భగవంతుడిని ఆరాధించడంలో ప్రశాంతత లభిస్తుంది ... కష్టాల్లో ఆయన మనకి తోడుగా వున్నాడనే ధైర్యం చిక్కుతుంది. దేవుడు ప్రత్యక్షంకాకపోవచ్చు ... ఏమీ మాట్లాడక పోవచ్చు. అంతమాత్రాన ఆయన లేడని ఎవరూ కొట్టిపారేయరు ... ఆయనని చూసే పరిణతిని తాము సాధించలేదనే అనుకుంటారు. అంతా ఇలా అనుకుంటూ ఉండటం వల్లనే తరతరాలుగా ఈ పూజా విధానం ఇలా కొనసాగుతూ వస్తోంది.

రానురాను భగవంతుడి పట్ల భక్తి ... పూజ పట్ల శ్రద్ధ పెరుగుతూ వస్తున్నాయే గాని తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో పూజకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోకాడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. పూజలో దీపపు కుందులను రెండు వాడటం జరుగుతుంది. ఇక వత్తులను రెండేసి వేసి వెలిగిస్తుంటారు. పూజా మందిరంలో గల ప్రతిమల చెంత పూలను సమర్పించవలసి వస్తే, ఒక్కొక్కటి కాకుండా రెండేసి పూలు పెడుతుంటారు.

అలాగే రెండు అగరొత్తులు ... రెండు హారతి కర్పూరం బిళ్లలు వెలిగిస్తుంటారు. ఇక నైవేద్యంగా పండ్లను సమర్పించవలసి వచ్చినప్పుడు, ఒక పండు కాకుండా రెండు పండ్లను సమర్పించడం జరుగుతుంటుంది. చాలామంది ఇలా భగవంతుడి పూజలో రెండు అనే సంఖ్యకు ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నది మాత్రం కొంతమందికి తెలియకపోవచ్చు.

రెండు అనే సంఖ్య ఆత్మ- పరమాత్మల ఐక్యతను సూచిస్తుంది. '' ఒకటి నీవైతే రెండోది నీను ... నీతోనే నీను ... నీలోనే నీను '' అనే ఆత్మ- పరమాత్మల ఐక్యతను ఈ విధానం సూచిస్తూ వుంటుంది. ఈ కారణంగానే దేవుడి సేవలో 'రెండు' ఉపయోగించడమనేది తరతరాలుగా వస్తోందని శాస్త్రం సెలవిస్తోంది.

More Bhakti Articles