శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడు

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడు
వేంకటేశ్వరస్వామి ఎక్కడ వుంటే అక్కడ ప్రతిరోజూ ఒక పండుగలానే వుంటుంది. ప్రతి రోజూ ఆయన ఆలయాలు భక్తులతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. వేంకటేశ్వరస్వామి అంటే భక్తులు ఎంతో అభిమానం .... మరెంతో అనురాగం ... అంతకు మించిన విశ్వాసం ఆవిష్కరిస్తుంటారు. నిండైన ఆయన మూర్తిని చూస్తూనే ఏదో తెలియని అనుభూతికి లోనై ఆనందబాష్పాలతో వెనుదిరిగే వాళ్లు ప్రతి చోటా కనిపిస్తూనే వుంటారు.

ప్రతి ఉదయం ఆయన దర్శనం చేసుకున్న తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలను ప్రారంభించే వాళ్లు చాలామందే వుంటారు. అలా భక్త జన బాంధవుడిగా వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన క్షేత్రాల్లో హైదరాబాద్ పంజాగుట్టలోని 'దుర్గానగర్' కాలనీ ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. స్వామి ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరుడిగా శ్రీదేవి - భూదేవి సమేతుడై దర్శనమిస్తుంటాడు. గర్భాలయంలో అమ్మవార్ల నడుమ స్వామివారు సుందరంగా ... సుమనోహరంగా దర్శనమిస్తూ ఉంటాడు.

ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. ఇక శనివారాల్లోను ... పర్వదినాల్లోను భక్తుల తాకిడి మరింత ఎక్కువగా వుంటుంది. ప్రతి యేటా స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఇక్కడి వేంకటేశ్వరుడుని దర్శించిన వారికి సకల శుభాలు చేకూరతాయని అంటారు. స్వామిని సేవించిన వారెందరో ఉన్నతమైన స్థితిని పొందినట్టు భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles