ఆకలితీర్చిన అలమేలు మంగమ్మ

ఆకలితీర్చిన అలమేలు మంగమ్మ
ఎప్పుడు చూసినా ఆడుతూ పాడుతూ హుషారుగా తిరిగే అన్నమయ్య ఒక్కసారిగా దైవారాధన వైపు మొగ్గుచూపుతాడు. దైవ చింతనలోనే ఆయన ఎక్కువకాలం గడుపుతూ వుండటం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. ఏదైనా పని పురమాయిస్తే ఆ ధ్యాసలో పడతాడనే ఉద్దేశంతో దర్భలు కోసుకురమ్మని చెబుతారు.

ఆ పనిమీద అడవికి వెళ్లిన అన్నమయ్య, అటుగా తిరుమల కొండకు వెళుతున్న భక్త బృందాన్ని చూస్తాడు. ఏదో శక్తి ఆవహించిన వాడిలా ఆ భక్త బృందాన్ని అనుసరిస్తాడు. కష్టతరమైన ఆ కాలిబాటలో రాళ్లు ... ముళ్లు కూడా చూసుకోకుండా ఆయన నడుస్తుంటాడు. ఆహారం తీసుకోవడం గానీ, దాహం తీర్చుకోవడం గాని చేయకపోవడంతో మార్గమధ్యంలోనే అన్నమయ్యకి నీరసం వస్తుంది. దాంతో ఆయన కొండెక్కలేక పోతుంటాడు.

అమ్మ మనసున్న అమ్మవారు ఆయన అవస్థలు చూడలేకపోతుంది. నీరసించి పడిపోయిన అన్నమయ్య దగ్గరికి వృద్ధురాలి వేషంలో అలమేలు మంగమ్మ వస్తుంది. అన్నమయ్యను తట్టిలేపి ఆకలి తీర్చుకోమంటూ ప్రసాదాన్ని అందజేస్తుంది. ఆకలి తీర్చుకోవడం వలన అవసరమైన శక్తి వస్తుందనీ, అప్పుడు కొండ ఎక్కడం తేలిక అవుతుందని ఆయనతో చెబుతుంది.

ఆ ప్రసాదాన్ని స్వీకరించిన అన్నమయ్య ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. కొండపై మరికొంత దూరం ముందుకు సాగితే శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం లభిస్తుందని చెప్పి అమ్మవారు అదృశ్యమవుతుంది. ఆ తల్లి స్పర్శ వలన అన్నమయ్యలో ఉత్తేజం కలుగుతుంది ... తేజస్సు పెరుగుతుంది. దాంతో ఆయన పాటలు పాడుకుంటూ పరమాత్ముడి పాదాల చెంతకు పరుగులుతీస్తూ వెళతాడు.

More Bhakti Articles