వనంలో వెలసిన సీతారాములు

వనంలో వెలసిన సీతారాములు
శ్రీ మహావిష్ణువు లోకకల్యాణం కోసం వివిధ రకాల అవతారాలను ధరించాడు. ఆ అవతారాలలో ఎవరు ఏ అవతారాన్ని ఆరాధిస్తే అదే అవతారంలో ఆయన వారిని ఆదరించాడు ... ఆపదల నుంచి గట్టెక్కించాడు ... అవసరమైతే వారి చెంతనే ఆవిర్భవించాడు. అలా శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా ఆవిర్భవించిన క్షేత్రం, ఖమ్మం జిల్లా 'వనంవారి కృష్ణాపురం'లో దర్శనమిస్తుంది.

ఇక్కడి సీతారాముల ప్రతిమలు అచ్చు భద్రాచలంలో మాదిరిగానే వుండటం విశేషం. సీతారాములు ఇక్కడ ఆవిర్భవించడానికి ... భద్రాచలంలో మాదిరిగా ఉండటానికి కారణం లేకపోలేదు. పూర్వం కృష్ణయ్య అనే ఓ భక్తుడు, ప్రతి సంవత్సరం భద్రాచలంలోని స్వామివారి కల్యాణానికి తప్పనిసరిగా వెళ్లి వస్తుండేవాడు. అలా కొన్ని సంవత్సరాలపాటు జరిగింది. కృష్ణయ్యకి వయసు పైబడిన కారణంగా ఆయన ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఇక సీతారాముల కల్యాణాన్ని చూసే భాగ్యం తనకి లేదని ఆయన భాదపడసాగాడు. ఆ రాత్రి ఆయనకు శ్రీరాముడు స్వప్న దర్శనమిచ్చాడు. ఇకమీదట తన కోసం ఆయన రానవసరం లేదనీ, తానే అతని కోసం వస్తున్నానని చెప్పాడట. భద్రాద్రి రాముడి రూపంలోనే తాను అతని వనంలో వెలుస్తున్నానంటూ ఓదార్చాడు. మరునాడు ఉదయం కృష్ణయ్య వెళ్లి చూడగా నిజంగానే సీతారాముల ప్రతిమ కనిపించింది.

కృష్ణయ్య ఆధ్వర్యంలో స్వామివారికి ఆలయ నిర్మాణం జరిగింది. భద్రాద్రిలో స్వామివారి కల్యాణం జరిగిన రోజు రాత్రికి ఇక్కడ కల్యాణం జరుపుతారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి స్వామివారు మహిమాన్వితుడనటానికి ఎందరివో అనుభవాలు ఆధారాలుగా కనిపిస్తుంటాయి. ఈ స్వామిని దర్శించిన వారికీ ... సేవించిన వారికి సకల శుభాలు చేకూరతాయని చెబుతుంటారు.

More Bhakti Articles