శ్రీ అళగనాథస్వామి క్షేత్రం

శ్రీ అళగనాథస్వామి క్షేత్రం

శ్రీ అళగనాథస్వామి క్షేత్రం
వైకుంఠాన్నివీడి తన భక్తులను ఉద్ధరించడానికి భూలోకానికి వచ్చిన శ్రీమహావిష్ణువు, అనేక ప్రాంతాల్లో వివిధ నామాలతో విరాజిల్లుతున్నాడు. అలాంటి విశిష్టమైన ... ప్రాచీనమైన క్షేత్రాల్లో ఒకటిగా 'శ్రీ అళగనాథస్వామి' క్షేత్రం అలరారుతోంది. భక్తులపాలిట కామధేనువు లాంటి ఈ క్షేత్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో దర్శనమిస్తుంది.

ఈ ఆలయ విస్తీర్ణం ... నిర్మాణ శైలి ఆనాటి వైభవాన్ని ఆవిష్కరిస్తూ వుంటాయి. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ఈ ఆలయం వైభవంతో వెలుగొందినట్టు చెబుతారు. ఆ తరువాత ఆంగ్లేయుల పరిపాలనా కాలంలోనూ ఈ క్షేత్రం తన ఘనతను చాటుకుంది. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో శ్రీదేవి - భూదేవి సమేతుడిగా అళగనాథస్వామి దర్శనమిస్తూ వుంటాడు.

స్వయంభువులుగా చెప్పబడుతోన్న ఈ మూర్తులు దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ వుంటాయి. విమాన దేవతలుగా వరాహ స్వామి ... నరసింహస్వామి ... నారాయణ స్వామి ... కేశవస్వామి దర్శనమిస్తూ వుంటారు. ఇక ఇక్కడి స్వామి లీలా విశేషాలను గురించిన కథలు అనేకం ప్రచారంలో వున్నాయి. విశేషమైనటువంటి పుణ్య తిథులలో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది.

పురాతనమైన ఆలయం కావడం వలన, ఇటీవల కాలంలోనే ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఎంతో మంది మహర్షులు ... మహారాజులు ... మహా భక్తులు దర్శించి ధన్యులైన కారణంగా, ఇక్కడి స్వామివారిని స్థానికులు తమ ఇలవేల్పుగా భావిస్తూ వుంటారు. ఆయన అనుగ్రహంతోనే తమ కార్యకలాపాలను చక్కబెడుతూ వుంటారు.

More Bhakti Articles