స్వామిని దర్శించిన కోతి!

స్వామిని దర్శించిన కోతి!
శ్రీ అక్కల్ కోట స్వామి వారి జీవితాన్ని ... ఆయా సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరుని పరిశీలిస్తే, ఆ సంఘటనలు మహిమలుగా కనులముందు కదలాడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రవర్తించిన తీరు ... మహిమలు చూపిన విధానం ఎంతో సరదాగా అనిపిస్తూ వుంటాయి. ఇలాంటి లీలలు శ్రీ నృసింహ సరస్వతి ... శ్రీపాద శ్రీవల్లభులు ... శ్రీ శిరిడీ సాయిబాబా వంటి వారి చరిత్రలలో కూడా మనకి కనిపిస్తూ వుంటాయి.

ఇక అక్కల్ కోటస్వామి విషయానికే వస్తే, ఆయనని దర్శించుకోవడానికి రోజూ ఎంతో మంది వస్తూ వుండేవారు. అలా వచ్చిన వారు తమ సమస్యలను చెప్పుకోకముందే, వాటికి ఆయన పరిష్కారమార్గాలను చెప్పి పంపించేవాడు. ఈ నేపథ్యంలో స్వామివారు కొంతమంది వ్యక్తులకు కబురు చేశాడు. విషయమేమిటో తెలియక ఆలోచిస్తూనే వాళ్లంతా స్వామి చెంతకు వచ్చారు.

కోతి తన జాతి లక్షణాన్ని బట్టే ప్రవర్తిస్తుందనీ, అంత మాత్రానికే దానిని చంపాలనుకోవడం అవివేకమని వారితో అన్నాడు స్వామి. కోతిని చంపితే ఆ పాపం జన్మజన్మలపాటు వెంటాడుతుందని ఆయన మందలించాడు. దాంతో వాళ్లంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఓ కోతి ఊళ్లో వాళ్లని తరచూ కరుస్తూ ఉండటంతో, వాళ్లంతా ఒక గుంపుగా ఏర్పడి దానిని చంపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సంగతి స్వామికి తెలిసిపోవడంతో వాళ్లంతా నేల చూపులు చూడసాగారు.

ఆ కోతిని చంపకుండా బంధించి తన దగ్గరికి తీసుకు రమ్మని వాళ్లతో చెప్పాడు స్వామి. అతికష్టం మీద కొన్ని రోజులకే వాళ్లు ఆ పని చేశారు. ఆ కోతిని స్వామి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని దాని చేష్టల పట్ల కొంత కోపాన్ని వ్యక్తం చేశాడు. ఇక నుంచి బుద్ధిగా నడచుకోమంటూ సున్నితంగా మందలించాడు. అరటి పండ్లు ఒలిచి ప్రేమతో దానికి తినిపించాడు. ఇక దాని జోలికి ఎవరూ వెళ్లకూడదని చెప్పి వదిలిపెట్టాడు. చూస్తున్న వాళ్లందరికీ ఇది చాలా విచిత్రంగా అనిపించింది.

అయితే వాళ్లందరినీ మరింత ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆ రోజు నుంచి ఆ కోతి ఎవరికి ఎలాంటి హాని కలిగించలేదు. పైగా ప్రతి రోజు ఉదయాన్నే స్వామి దగ్గరికి వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళుతూ వుండేది. అది అలా అలవాటు కావడంతో, తన కోసమని భక్తులు ఇచ్చిన పండ్లను దాని కోసమని స్వామి ఉంచేవాడట. సరదాగా అనిపించేదే అయినా, మహిమాన్వితమైన ఈ సంఘటనను గురించి ఇప్పటికీ ఆయన భక్తులు చెప్పుకుంటూ వుంటారు.

More Bhakti Articles