కార్తీక శంభులింగేశ్వరుడు

కార్తీక శంభులింగేశ్వరుడు
పరమశివుడు చల్లదనాన్ని ఎక్కువగా కోరుకుంటాడు. అందుకేనేమో ఆయన మనసు మంచుకొండలను తలపిస్తుంది. ఆయన చూపు కార్తీకంలో చంద్రుడి వెన్నెల కిరణాలను మరిపిస్తుంది. పిలిస్తే పరమేశ్వరుడు పలుకుతాడనీ, తమని చల్లగా చూస్తాడని భక్తులు భావిస్తుంటారు. ఆయన అభిమానాన్ని ... అనుగ్రహాన్ని పొందడానికి ఆయన క్షేత్రాల చుట్టూ తిరుగుతూ వుంటారు.

ఇక కార్తీక మాసంలో ఆయన కురిపించే కరుణామృత ధారలు ఎక్కువగా వుంటాయి కనుక, ఆ సమయంలో ఆయన దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎంతగానో ఆరాటపడుతుంటారు. అలా కార్తీకంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించే క్షేత్రాల్లో 'శ్రీ శంభులింగేశ్వరస్వామి' క్షేత్రం ఒకటిగా దర్శనమిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం 'ఖిల్లా వరంగల్'లో విరాజిల్లుతోంది.

ఈ ఆలయానికి కావలసినంత పురాణ నేపథ్యం ... చారిత్రక వైభవం వున్నాయి. ఇక స్వామివారు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన విధానం కూడా ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. పూర్వం ఇక్కడ భూమిలోగల శివలింగం కొద్ది భాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉండేదట. అది శివలింగమని కూడా ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆ రాయికి ఏది తగిలినా అది బంగారం రంగులోకి మారడం మొదలుపెట్టింది.

ఈ విషయం తెలిసిన రెండవ ప్రోలరాజు ఆ ప్రదేశంలో తవ్వించగా మహా తేజస్సుతో వెలిగిపోతున్న శివలింగం కనిపించింది. తీయడానికి ఎంతగా ప్రయత్నించినా అది రాకపోవడంతో, ఆ శివలింగానికి అక్కడే ఆయన ఆలయాన్ని నిర్మించినట్టు స్థలపురాణం చెబుతుంది. ఆ శివలింగం తన రాజ్యాన్ని రక్షిస్తుందనే ఉద్దేశంతోనే ఆయన ఆ చుట్టుపక్కల కోటలు నిర్మించాడని అంటారు.

ప్రాచీన వైభవాన్ని ప్రతిబింబిస్తోన్న ఈ క్షేత్రంలో స్వామివారు శంభులింగేశ్వరుడుగా ... అమ్మవారు మహిషాసురమర్ధినిగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. మహా శివరాత్రి పర్వదినం రోజున ... కార్తీకమాసంలోను ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక్కడి స్వామిని దర్శించడం వలన సిరిసంపదలు ... ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

More Bhakti Articles