వర్షం కురిపించిన దీక్షితులు!

వర్షం కురిపించిన దీక్షితులు!
పూలకి సుగంధంలా ముత్తుస్వామి దీక్షితులకు సంగీత సాహిత్యాలు తోడయ్యాయి. ఆయన నడచి వస్తుంటే సంగీత సరస్వతి నడచివస్తున్నట్టుగా ప్రజలు భావించేవారు. ఆయన అడుగుపెట్టిన ప్రదేశం పవిత్రమైనదిగా భావించి కళ్లకు అద్దుకునేవారు. ఆయన సంగీతానికి దేవతలు సైతం పరవశించిపోతారని చెప్పుకునేవారు. అయితే అలాంటి సంఘటనలు కూడా జరగకపోలేదు.

ఈ నేపథ్యంలో ముత్తుస్వామి దీక్షితులు అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వుండేవారు. ఆయా ప్రాంతాలలో ఆవిర్భవించిన దైవాలకు తన మధురమైన స్వరంతో కీర్తనలను నైవేద్యంగా సమర్పించే వారు. అలా ఆయన ఒకసారి వివిధ క్షేత్రాలను దర్శిస్తూ 'ఎట్టాయపురం' అనే గ్రామానికి చేరుకున్నారు. దైవస్వరూపుడైన ముత్తుస్వామి దీక్షితులు తమ ప్రాంతానికి వచ్చాడని తెలిసి చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఆయనని దర్శించుకోవడానికి వచ్చారు. దూరం నుంచే ఆయనని చూస్తూ వినయ విధేయతలతో నమస్కరించారు.

అయితే ఆ ప్రాంతాన్ని ... అక్కడి మనుషులను పరిశీలించిన ముత్తుస్వామికి, వాళ్లంతా పంటలులేక ... దాహం తీర్చుకోవడానికి నీళ్లు కూడాలేక కరవు కోరల్లో చిక్కుకున్నారని గ్రహించాడు. వాళ్ల దుర్భరమైన పరిస్థితి ఆయన మనసును కదిలించి వేసింది. అంతే వెంటనే ఆయన ఆ గ్రామంలోగల అమ్మవారిని దర్శించుకున్నాడు. వర్షాన్ని కురిపించి ఆ ప్రాంత ప్రజలను కరవు బారి నుంచి కాపాడమని కోరుతూ, 'అమృత వర్షిణి' రాగంలో కీర్తనను ఆలపించాడు.

అంతే అందరూ చూస్తుండగానే ఆకాశం మేఘావృతమై కుండపోతగా వర్షం కురిసింది. బావులు ... చెరువులు నిండేలా కురుస్తోన్న వర్షాన్ని చూసి అక్కడి ప్రజలు సంతోషంతో పొంగిపోయారు. వర్షం తగ్గగానే అందరూ పరుగునవెళ్లి ముత్తుస్వామి దీక్షితుల వారి పాదాలపై పడి నమస్కరించారు. ఆయన అక్కడి అమ్మవారికి తన కీర్తనల ద్వారానే కృతజ్ఞతలు తెలియజేస్తూ బయలుదేరాడు.

More Bhakti Articles