పాతివ్రత్యానికి పరీక్ష!
ఓ రోజున 'చ్యవన మహర్షి' తన ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ వుండగా, దేవతా వైద్యులైన అశ్వనీకుమారులు (సూర్యపుత్రులు) అక్కడికి వస్తారు. అదే సమయంలో నది నుంచి నీరు తీసుకువస్తోన్న 'సుకన్య'ను చూస్తారు. చ్యవన మహర్షిని కలుసుకోవడానికి వాళ్లు వచ్చి ఉంటారని భావించిన సుకన్య, ఆయన ధ్యానంలో ఉన్నట్టుగా చెబుతుంది.
ఆయనతో తమకి ఎలాంటి పని లేదనీ, ఆమె సౌందర్యం గురించి విన్న కారణంగా చూసి వెళదామని వచ్చామని వాళ్లు సమాధానమిస్తారు. ఆ మాటలకు సుకన్య ఒక్కసారిగా బిత్తరపోతుంది. అశక్తుడైన వృద్ధుడిని ... అందునా అంధుడిని పెళ్లాడి అందమైన యవ్వనాన్ని అడవిపాలు చేయవద్దని వాళ్లు సుకన్యతో అంటారు.
ఆమె అంగీకరిస్తే వివాహం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెబుతారు. తమని వివాహమాడటం వలన, అనంతమైన భోగాలను అనుభవించ వచ్చని అంటారు. అలా ఎన్ని విధాలుగా ఆశ చూపినా సుకన్య పట్టించుకోకపోవడంతో, ఆమెను తాకడానికి సిద్ధపడతారు. అప్పటి వరకూ సహనాన్ని పాటిస్తూ వచ్చిన సుకన్య, వారిని శపించబోతుంది.
దాంతో కంగారుపడిపోయిన అశ్వనీ కుమారులు, తమ గురించి సుకన్యకు చెబుతారు. ఆమె పాతివ్రత్యం గురించి విన్నామనీ, పరీక్షించి తెలుసుకున్నామని అంటారు. ఈ విషయంలో ఆమె మనసుకి కష్టం కలిగించినదుకు మన్నించమని కోరతారు. దాంతో శాంతించిన సుకన్య, తన భర్త అయిన చ్యవన మహర్షికి వారిని పరిచయం చేస్తుంది.