కలకత్తా కాళీమాత

కలకత్తా నగరానికే కాకుండా వంగదేశానికంతటికి ఆరాధ్య దేవత 'కాళీమాత'. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి అమ్మవారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనీ, పిలిస్తే పలుకుతుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తూ వుంటారు. సతీదేవి వియోగాన్ని భరించలేక పోయిన శివుడు ఆమె నిర్జీవ శరీరాన్ని భుజానవేసుకుని తిరుగుతూ వుండగా, శివుడిని మామూలు స్థితికి తీసుకురావడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని తన చక్రంతో ఛేదించాడు. ఫలితంగా ఛిద్రమైన ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు 'అష్టాదశ శక్తి పీఠాలు'గా అవతరించాయి. అలా ఆమె 'పాదాగ్రం' పడిన ఈ ప్రదేశంలోనే కాళీమాత అవతరించిందని అంటారు.

ఇక్కడి అమ్మవారిని చూడాలంటే కాస్తంత గుండె ధైర్యం కావలసిందే. అంతటి రౌద్ర రూపంలో ఆమె దర్శనమిస్తుంటుంది. ఆమె ఉగ్ర స్వరూపిణి అయినప్పటికీ 'అమ్మా'అని పిలిస్తే చాలు కొవ్వొత్తిలా కరిగిపోయి కోరిన వరాలను ఇస్తుందని అంటారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో గంగాసాగర సంగమం వుంది. కాళీఘాట్ లో అమ్మవారు ఎంత ఉగ్ర స్వరూపిణిగా కనిపిస్తుందో, గంగాసాగర తీరంలో అంత ప్రశాంత మూర్తిగా దర్శనమిస్తుంది.

'దక్షణేశ్వర్'లోని కాళీమాత మహా శక్తిమంతమైనది. రామకృష్ణ పరమహంస సేవించినది ... వివేకానందుడికి ముక్తి మార్గాన్ని చూపించినది ఈ అమ్మవారే. ఇక్కడి బేలూరు మఠం అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. ఈ క్షేత్రానికి వెళ్లినవారు అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా, ఆమె అనుగ్రహానికి పాత్రుడైన రామకృష్ణ పరమహంస మఠాన్ని చూడవచ్చు. రామకృష్ణుల వారు చూపిన మార్గంలో నడుస్తూ భారతీయుల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన వివేకానందుడి స్పూర్తిని గుండెల నిండుగా నింపుకుని తిరిగిరావచ్చు.


More Bhakti News