మధురై సభ వివాదం.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై క్రిమిన‌ల్ కేసు నమోదు

  • బీజేపీ నేత అన్నామలై, హిందూ మున్నాని నేతలపైనా కేసు నమోదు
  • మధురై సభలో కోర్టు నిబంధనల ఉల్లంఘన ఆరోపణ
  • విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని ఫిర్యాదు
  • భారతీయ న్యాయ సంహిత కింద పలు సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్
  • జూన్ 22న మురుగన్ భక్తుల మహాసభలో ఘటన
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. మధురైలో ఇటీవల జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును నమోదు చేశారు. పవన్‌తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై, హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఏం జరిగిందంటే?
జూన్ 22న మధురైలో 'మురుగన్ భక్తుల మహాసభ' పేరుతో హిందూ మున్నాని భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సభకు పవన్ కల్యాణ్, అన్నామలై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే, ఈ సభలో చేసిన ప్రసంగాలు, ఆమోదించిన తీర్మానాలు మతాల మధ్య విద్వేషాలు పెంచేలా ఉన్నాయని, ఇది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని ఆరోపిస్తూ మధురైకి చెందిన న్యాయవాది, పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ కోఆర్డినేటర్ ఎస్. వంజినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నమోదైన సెక్షన్లు ఇవే
వంజినాథన్ ఫిర్యాదు ఆధారంగా మధురైలోని అన్నానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 196(1)(ఎ), 299, 302, 353(1)(బి)(2) కింద అభియోగాలు మోపారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో పవన్, కె. అన్నామలైతో పాటు హిందూ మున్నాని అధ్యక్షుడు కదేశ్వర సుబ్రమణ్యం, రాష్ట్ర కార్యదర్శి ఎస్. ముత్తుకుమార్, ఇతర ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, సంఘ్ పరివార్ నిర్వాహకులను నిందితులుగా చేర్చారు.

వివాదానికి కారణమైన ప్రసంగాలు, తీర్మానాలు
ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతి పొంది, రాజకీయ, మతపరమైన ప్రసంగాలు చేయరాదన్న హైకోర్టు షరతును నిర్వాహకులు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులు ఏకతాటిపై నిలిచి ఓటు వేయాలని, డీఎంకే ప్రభుత్వం ఆలయాలను ఆదాయ వనరుగా చూడటం మానుకోవాలని సభలో తీర్మానాలు చేయడం వివాదాస్పదంగా మారింది.


More Telugu News