Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల సునామీ.. ఒకే రోజు 22 శతకాలు!

Vijay Hazare Trophy sees Century Storm 22 Hundreds in a Day
  • కోహ్లీ, రోహిత్ మాస్ విన్యాసం.. సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
  • ఆంధ్రాతో మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్ కోహ్లీ సెంచరీ
  • సిక్కిం బౌలర్లను చీల్చి చెండాడిన రోహిత్ శర్మ
  • ప్రపంచ లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన బీహార్
భారత దేశవాళీ వన్డే సమరంలో రికార్డులు ఒక్కొక్కటిగా పేకమేడల్లా కూలిపోయాయి. విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే పరుగుల ప్రవాహం పారింది. ఒకే రోజు ఏకంగా 22 సెంచరీలు నమోదై క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. చాలా కాలం తర్వాత దేశవాళీ బరిలోకి దిగిన టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ శతకాలతో విరుచుకుపడగా.. బీహార్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డుతో సంచలనం సృష్టించాడు.

ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (131) సెంచరీతో చెలరేగి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా (330 ఇన్నింగ్స్‌ల్లో) 16,000 పరుగుల మైలురాయిని అందుకుని సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. మరోవైపు ముంబై సారథి రోహిత్ శర్మ సిక్కిం బౌలర్లను చీల్చిచెండాడాడు. కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు (18 ఫోర్లు, 9 సిక్స్‌లు) చేసి తానెందుకు 'హిట్‌మ్యాన్' అనిపించుకుంటాడో నిరూపించాడు.

ఈ టోర్నీలో హైలైట్ అంటే బీహార్ జట్టు ప్రదర్శనే. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బీహార్ ఏకంగా 574/6 పరుగులు చేసి, ప్రపంచ లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. కేవలం 14 ఏళ్ల వయసులో సెంచరీ బాది, లిస్ట్-ఏ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 59 బంతుల్లోనే 150 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ రికార్డును బ్రేక్ చేశాడు. బీహార్ కెప్టెన్ గనీ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకుని, భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడిగా నిలిచాడు.

ఇక బీహార్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 38 సిక్సర్లు, 49 ఫోర్లు నమోదయ్యాయి. జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో ఫామ్ చాటుకున్నాడు. ఒడిశా ఆటగాడు స్వస్తిక్ సమల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో రికార్డుల్లోకి ఎక్కాడు. మొత్తానికి విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే బ్యాటర్ల విధ్వంసానికి వేదికై, క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది.
Vijay Hazare Trophy
Virat Kohli
Rohit Sharma
Vaibhav Suryavanshi
Sachin Tendulkar
AB de Villiers
Ishan Kishan
Swastik Samal
Domestic Cricket
List A Cricket

More Telugu News