Veerapandian: ఆరోగ్య శాఖ కీలక ఒప్పందం .. గిరిజన ప్రాంతాలకు డ్రోన్‌ల ద్వారా మందుల సరఫరా

Veerapandian AP to Deliver Medicines via Drones to Tribal Areas
  • ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతో రెడ్‌వింగ్‌ సంస్థతో ఒప్పందం 
  • ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన కమిషనర్‌ వీరపాండియన్‌, రెడ్‌వింగ్‌ సంస్థ ప్రతినిధి కుందన్‌ మాదిరెడ్డి 
  • పాడేరు నుంచి జనవరి నెలాఖరులో ప్రారంభంకానున్న డ్రోన్ సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా ఔషధాలు, బ్లడ్ యూనిట్లు చేరవేయడంతో పాటు అక్కడి నుంచి రక్తం, మల, మూత్ర నమూనాలను వైద్య పరీక్షల కోసం సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ డ్రోన్ సేవలు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు నుంచి జనవరి నెలాఖరుకు ప్రారంభం కానున్నాయి.

ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంగళగిరిలో నిన్న రెడ్‌వింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్, రెడ్‌వింగ్ సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

రెడ్ వింగ్ సంస్థ ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ తరహా సేవలను అందిస్తుండగా, ఏపీలో ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’గా ప్రాథమికంగా ఆరు నెలల పాటు ఉచిత సేవలు అందించేందుకు అంగీకరించింది. పాడేరు కేంద్రంగా 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు డ్రోన్ సేవలు ప్రారంభించనున్నారు.

భవిష్యత్తులో విశాఖ కేజీహెచ్ నుంచి పాడేరుకు కూడా మందులను డ్రోన్ల ద్వారా రవాణా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోల్డ్‌చైన్ సదుపాయంతో రెండు కిలోల వరకు బరువు మోసే డ్రోన్లను అందుబాటులోకి తీసుకువస్తామని కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. 
Veerapandian
Andhra Pradesh health
drone medicine delivery
tribal areas AP
Redwing
Alluri Sitarama Raju district
Paderu
AP health department
blood units
medical supplies

More Telugu News